ఏపీ పీసీసీ సమావేశం పారదర్శకంగా నిర్వహిస్తాం
సాక్షి, విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం పూర్తి పారదర్శకంగా నిర్వహించి, ఓటమికి గల కారణాలను తెలుసుకుంటామని మాజీ మంత్రి ఎస్.శైలజానాధ్ తెలిపారు. సోమవారం విజయవాడలోని పరిణయ కల్యాణమండపంలో జరిగిన విలేకర్ల సమావేశంలో శైలజానాథ్ మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో ఇతర రాష్ట్ర నాయకులు, మాజీ కేంద్ర,రాష్ట్ర మంత్రులు సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.
రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి సమగ్రంగా చర్చిస్తామని వివరించారు. ఇదే సమయంలో టీడీపీ, బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను చర్చించి, రాబోయే రోజుల్లో వాటిని అమలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర వత్తిడి తీసుకువస్తామని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో రుణమాఫీపై చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ తరుఫున రైతులకు, మహిళలకు అండగా ఉండి పోరాటాలు చేస్తామని వివరించారు.
సమావేశంలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మాట్లాడుతూ గత ఎన్నికల్లో తాము గెలుస్తామని భావించలేదని, ఓడిపోయినప్పటికీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పరిణయ కల్యాణ మండపంలో సమీక్ష జరుగుతుందని, సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.
కాంగ్రెస్ నేత రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందకు కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు , సిటీ అధ్యక్షుడు అడపా నాగేంద్ర, మీసాల జిల్లా అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహరావు, తదితరులు పాల్గొన్నారు.