ముంబైలో మళ్లీ ఉగ్రవాదుల కలకలం?
భారత వాణిజ్య రాజధాని ముంబై మహానగరం మరోసారి ఉలిక్కిపడింది. నగరంతో పాటు సముద్రతీరంలో కూడా ఒక్కసారిగా తనిఖీలు ముమ్మరం అయ్యాయి. ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో నవీముంబైలోని ఓ నేవల్ బేస్‌కు సమీపంలో తిరుగుతుండగా తాము చూశామని కొంతమంది విద్యార్థులు చెప్పడంతో మళ్లీ ఒక్కసారిగా నగరంలో ఉగ్రవాదులు ప్రవేశించారన్న కలకలం రేగింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) కమాండోలను ముంబైలోని మూడు కీలక ప్రాంతాల్లో మోహరించారు. అవసరమైతే వచ్చేందుకు సిద్ధంగా మరో బృందం ఢిల్లీలో ఉంది. నౌకాదళానికి చెందిన హెలికాప్టర్లు, కోస్ట్ గార్డ్ పెట్రోలింగ్ బోట్లు రంగంలోకి దిగాయి. జమ్ముకశ్మీర్‌లోని ఉడీ ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడి 18 మంది భారతీయ సైనికులను హతమార్చిన నేపథ్యంలో, ఈసారి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని ముంబై నగరం మొత్తాన్ని హై ఎలర్ట్‌లో ఉంచారు.
నౌకాదళం హై ఎలర్ట్‌లో ఉందని, ముంబైలోని కరంజా ప్రాంతంలో కొంతమంది అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు స్కూలు పిల్లలు చెప్పడంతో తనిఖీలు ముమ్మరం అయ్యాయని భారత నౌకాదళం ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ తెలిపారు. తనిఖీలు ప్రారంభించేందుకు ముందే ఆ ప్రాంతంలోని స్కూళ్లన్నింటినీ పోలీసులు మూయించేశారు. నగరంలో ప్రవేశించడానికి అవకాశం ఉన్న మొత్తం 91 ప్రాంతాలనపు కూడా అప్రమత్తం చేశారు. 2008లో లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాదులు నగరంలోకి జలమార్గంలో ప్రవేశించి నవంబర్ 26వ తేదీన మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ముంబై నగరం ఏ చిన్న విషయం తెలిసినా బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది.
గేట్‌వే ఆఫ్ ఇండియా, రాజ్‌భవన్, బాంబే హై వద్ద డ్రిల్లింగ్ రిగ్, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఇతర ప్రధాన కేంద్రాల వద్ద భద్రత ముమ్మరం చేశారు. నగరం మొత్తం హై ఎలర్ట్ ప్రకటించామని, భద్రత విషయంలో అన్ని చర్యలు తీసుకున్నామని ముంబై జాయింట్ పోలీసు కమిషనర్ దేవేన్ భర్తీ తెలిపారు. రోడ్ల మీద బ్యారికేడ్లు పెట్టి.. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముంబైకి, పాకిస్థాన్‌కు మధ్య ఉన్న గుజరాత్ రాష్ట్రాన్ని కూడా అప్రమత్తం చేశారు. నిఘా సంస్థలు తీరప్రాంతంలో అప్రమత్తంగా ఉన్నాయి. ఈ విషయాన్ని అదనపు డీజీపీ తీర్థరాజ్ తెలిపారు.