'రాహుల్ ప్రధాని అవుతారు'
అనంతపురం : ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ ఎన్నిక సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీలు గుప్పించి.... అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను ఆయన విస్మరించి నిరుద్యోగ యువతను దగా చేశారని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ రతన్ ఆరోపించారు. అనంత జిల్లాలో ఈ నెల 24న జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాదయాత్ర సందర్భంగా బుధవారం రాజీవ్ రతన్ అనంతపురం విచ్చేశారు. ఈ సందర్భంగా నగరంలోని డీసీసీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని టీడీపీ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా పేదలను ఉన్నత విద్యకు దూరం చేశారంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రైతులు, పేదల కష్టాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రైతు భరోసా యాత్ర చేపట్టారని వివరించారు. రాహుల్ ప్రధానమంత్రి అవుతారని... దాంతో దేశంలో అన్ని వర్గాల వారి కష్టాలు తొలగిపోతాయని రాజీవ్ రతన్ జోస్యం చెప్పారు. రాహల్ గాంధీ అనంత జిల్లాలో నిర్వహించే పాదయాత్రలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎన్ఎస్యూఐ శ్రేణులు భారీగా తరలి వస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దాదాగాంధీ, ఎన్ఎస్యూఐ నాయకులు లోకేశ్, శివశంకర్ తదితరులు పాల్గొనారు.