ఏఈఎస్ జనక్‌పురి పాఠశాలలో ఘనంగా మాతృభాషా దినోత్సవం
సాక్షి, న్యూఢిల్లీ: జనక్‌పురిలోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ఎన్టీ రామారావు మెమోరియల్ సీనియర్ సెకండరీ పాఠశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రకమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ అనిత విద్యార్థులందరికీ ప్రపంచ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంతో వేడుకలు ఆరంభమయ్యాయి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని భాషల వారు తమ మాతృభాషను చూసి గర్వించాలని, ఇతర భాషలను కించపరచరాదని హితవు పలికారు. ఈ సందర్భంగా ఎనిమిదో తరగతి విద్యార్థిని శ్రీవైష్ణవి తెలుగులో అనర్ఘళంగా ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. 10 వ తరగతి విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి, తెలుగు ఉపాధ్యాయులు పాడిన మా తెలుగుతల్లికి మల్లెపూదండపాటకు నృత్యరూపకాన్ని ప్రదర్శించారు.
పాఠశాలలో పనిచేస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు తమ తమ మాతృభాషల్లో ప్రసంగించారు. త్రిభాషా సూత్రాన్ని అనుసరించి తెలుగు ఉపాధ్యాయుడు టి. లక్ష్మీనారాయణ, హిందీ ఉపాధ్యాయిని రూపేశ్వరి, ఆంగ్ల ఉపాధ్యాయిని ప్రసన్న లక్ష్మి మూడు భాషల గొప్పదనాన్ని గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రెండోతరగతి విద్యార్థిని సాయినందిని చక్కని తెలుగు పాటపాడి వినిపించింది. తెలుగు భాషేతరులైన విద్యార్థులు తెలుగు పద్యాలు చదివి వినిపించారు. తెలుగు విద్యార్థులు తెలుగు భాష ప్రాశస్త్యాన్ని , తెలుగుపై మక్కువను తమ కవితల ద్వారా చాటారు. హిందీ మాతృభాషగా కలిగిన విద్యార్థులు తెలుగులో మాట్లాడడంద్వారా ఏ భాష నేర్చుకోవాలన్నా శ్రద్ధాసక్తులు ఉంటే సరిపోతుందనే విషయాన్ని నిరూపించారు.