మహానాడు షురూ
చేవెళ్ల/మొయినాబాద్ రూరల్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకొని ప్రతి యేటా నిర్వహిస్తున్న మహానాడు మంగళవారం ప్రారంభమైంది. మొయినాబాద్ మండల పరిధి హిమాయత్‌నగర్ గ్రామ పంచాయతీ శివారులోని గండిపేట కుటీరంలో రెండు రోజుల పాటు నిర్వహించే వేడుకలను పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. సరిగ్గా ఉదయం 10గంటల 35 నిమిషాలకు హిమాయత్‌నగర్ చేరుకున్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడే ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేశారు.
అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి తిలకించారు. పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సరిగ్గా 11గంటల 10 నిమిషాలకు సభా వేదికపైకి చేరుకున్న ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపనతో 33వ మహానాడు ప్రారంభమైంది.గత సంవత్సర కాలంలో మృతిచెందిన పార్టీ కార్యకర్తలకు సంతాపం ప్రకటించారు.