ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చేవరకు పోరాడతా: చంద్రబాబు
హైదరాబాద్: దివంగత నందమూరి తారక రామారావుకు 'భారతరత్న' పురస్కారం ఇచ్చేవరకు పోరాడతానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ శివారు గండిపేటలో జరుగుతున్న మహానాడు రెండో రోజున ఆయన మాట్లాడారు. పేదలకు అనేక పథకాలు చేపట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ పేరు మీద చీర - ధోవతి పథకాన్ని ప్రవేశపెడతానని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 92వ జయంతి సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలంటూ చంద్రబాబు తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని మహానాడు ఆమోదించింది. టీడీపీ కేంద్రకమిటీ అధ్యక్ష పదవికి సీఎం చంద్రబాబు తరఫున ఆరు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. త్వరలోనే రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు అధ్యక్షులను ఎన్నుకుంటారు.
జూన్ 5 నుంచి గుంటూరు పర్యటన
చంద్రబాబునాయుడు జూన్ 5 నుంచి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోజు గుంటూరులో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. ఆ మర్నాడు మందడం - తాళ్లాయపాలెం మధ్య రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. జూన్ 8న నవ నిర్మాణ దీక్షలో పాల్గొంటారని సమాచారం.