టీడీపీ ఇంటి పోరు
మొక్కుబడిగా ఎన్టీఆర్ గృహాల మంజూరు
పంపిణీలో పోటీ పడుతున్న అధికార పార్టీ నాయకులు
బహిర్గతమవుతున్న అంతర్గత పోరు
దిక్కుతోచని అధికారులు
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పట్టున్న ఓ మండలంలో అధికార పార్టీ నాయకులు ఇళ్ల కోసం పోటీ పడుతున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్న టీడీపీకి చెందిన ఓ సర్పంచ్ పశువులను కట్టేసుకోడానికి పక్కా గృహాన్ని మంజూరు చేయించుకున్నారు. మండలస్థాయి ప్రజా ప్రతినిధి సోదరుడు ఇంతకుముందే ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహం కట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి ఇల్లు మంజూరు చేయించుకున్నారు.
సత్యవేడు మండలంలోని టీడీపీ నాయకుల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత కుమ్ములాటలు పక్కాగృహాల మంజూరు సందర్భంగా బహిర్గతమయ్యాయి. ఈ మండలానికి కేవలం 89 ఇళ్లు కేటాయించారు. అవి కూడా అధికార పార్టీ కార్యకర్తలకే కేటాయించారు. ఇందులో జన్మభూమి కమిటీలు ప్రముఖ పాత్ర పోషించాయి. ఇదిలా ఉండగా చెరివి పంచాయతీలో ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వారికి ఇళ్లు కేటాయించడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని అధికార పార్టీ నాయకుల్లో పక్కా గృహాల పోరు మొదలైంది. జిల్లాకు పక్కా గృహాలు మొక్కుబడిగా మంజూరయ్యాయి. వీటి పంపకాల్లో పొత్తులు కుదరక అధికార పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులు, ఇళ్లు ఉన్న వారు కూడా ప్రభుత్వ గృహాల కోసం పోటీపడుతున్నారు. పేదల పరిస్థితి ఎలా ఉన్నా తమ పార్టీ అధికారంలో ఉండగా తమకు ఇళ్లు దక్కాల్సిందేనని పట్టుబట్టుతున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు సంవత్సరాయింది.
ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకపోవడంతో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోందని భావించిన ప్రభుత్వం నియోజకవర్గానికి 900 ఇళ్లు, అర్బన్ నియోజకవర్గాలకు 350 ఇళ్లు కేటాయించింది. గతంలో కేటాయించిన ఇళ్లను రద్దు చేసి వాటిని మదించి కొత్తగా కేటాయించింది. దీంతో అధికారీ పార్టీ నాయకులకు కొత్త తిప్పలు మొదలయ్యాయి. గ్రామానికి కనీసం 5 ఇళ్లు కూడా రాకపోవడంతో కుమ్ములాటలు ప్రారంభం అయ్యాయి. పూతలపట్టు మండలానికి 100 ఇళ్లు కేటాయించారు. వీటిని 25 పంచాయతీలు పంచుకోవాల్సి ఉంటుంది.
అంటే ఒక్కో పంచాయతీకి 4 ఇళ్లే. ఒక పంచాయతీలో ఎంత తక్కువ కాదన్నా 4 గ్రామాలుంటాయి. ఒక్కో గ్రామానికి ఒక ఇల్లు మంజూరు చేసినట్టే. దీనికి తోడు గ్రామాల్లో గ్రూపులు ఉండటంతో పంపకాలు పూర్తి కావడంలేదు. ఒకవేళ పంపిణీ అయినా టీడీపీలో గ్రామస్థాయిలో బలమైన నాయకుడు తీసుకోవడంతో మిగిలిన వారు కక్కలేక మింగలేక ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఈ పంచాయతీ ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ ఇన్చార్జిల దృష్టికి వెళ్లడంతో వారు పంపిణీలో నిమగ్నమయ్యారు. చాలీచాలని ఇళ్లు కేటాయించడంపై ప్రభుత్వంపై ప్రజలతో పాటు.. పార్టీ కార్యకర్తలు కూడా మండిపడుతున్నారు.
అనర్హులకు ఎన్టీఆర్ గృహాలు
ఎన్టీఆర్ గృహాలను అనర్హులకు కేటాయిస్తున్నారు. అన్ని ఇళ్లు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకే కట్టబెట్టడానికి లాంఛనాలు ఇదివరకే పూర్తయ్యాయి. వీరిలో కూడా ఆర్థికంగా స్థితిమంతంగా ఉన్నవారికి కేటాయిస్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి ఆకాశాన్ని తాకుతోంది. డబ్బున్నవారికి ఇళ్లు కేటాయించినా ఉపయోగం ఉండదనీ.. వారు పశువుల కొట్టాలుగా వినియోగించుకుంటారని కార్యకర్తలు వాపోతున్నారు.
పంపకాలు కుదరక..
మరోవైపు పంపకాలు కుదరక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేదంటే నియోజకవర్గ ఇన్చార్జిల చుట్టూ తిరుగుతున్నారు. మొక్కుబడిగా ఇళ్లు కేటాయించడం, తరువాత వాటి కేటాయింపులో నాయకులు నాన్చుడు దోరణితో పంపిణీలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.