NTR National Literary Award
-
ఎన్టీఆర్ పురస్కారానికి ‘నగెన్’ ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ అస్సామీ కథకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, అస్సామీ పత్రికల సంపాదకుడు ‘నగెన్ సైకియా’ను 2019 ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి వెల్లడించారు. ట్రస్ట్ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారితో కలిసి ఆమె గురువారం లక్డీకాపూల్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2006లో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్‌ను స్థాపించామని తెలిపారు. 2007 నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 26 భాషల్లోని ప్రముఖులకు ఏటా పురస్కారాలు అందిస్తున్నామన్నారు. గతంలో ఎస్ఎల్ ఖైరప్ప (కన్నడం), సచ్చిదానందన్ (మలయాళం), అశోక్ మిత్రన్ (తమిళం), మహా శ్వేతాదేవి (బెంగాలీ), మనోజ్ దాస్ (ఒరియా), నేమాడి బాలచందర్ (మరాఠీ), జిలానీ బానో (ఉర్దూ), డాక్టర్ రఘువీర్ చౌదరి (గుజరాతీ) తదితరులను ఎంపిక చేశామని పేర్కొన్నారు. తెలుగుకు సంబంధించి ఆవత్స సోమసుందరం, రవ్వా శ్రీహరి, డాక్టర్ సి.నారాయణరెడ్డి, కాళీపట్నం రామారావు తదితర భాషా సాహితీవేత్తలకు పురస్కారాలు అందజేశామన్నారు. కేవీ రమణాచారి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జయంతి రోజైన ఈ నెల 28న నగెన్ సైకియాకు పురస్కారాన్ని ప్రదానం చేస్తామని తెలిపారు. పురస్కారం కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రంతో పాటు, జ్ఞాపికను బహూకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతల సంఘం అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, న్యాయ నిర్ణేతల సంఘం సభ్యులు డాక్టర్ సూర్య ధనుంజయ్, డాక్టర్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. -
సమాజ పరిశీలనతోనే పట్టు సాధిస్తాం
{పముఖ కథకుడు కాళీపట్నం రామారావు కాళీపట్నంకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రదానం హైదరాబాద్ : సమాజాన్ని సునిశిత అధ్యయనం చేయడం వల్లనే విషయసమగ్రత, వివిధ అంశాలపై పట్టు సాధించగలమని ప్రముఖ కథకుడు, శ్రీకాకుళం కథానిలయం నిర్వాహకుడు కాళీపట్నం రామారావు అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో కాళీపట్నంకు ‘ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారాన్ని అందజేశారు. ఈ సభలో రామారావు మాట్లాడుతూ పెద్దలు చెప్పిన విషయాలను తెలుసుకోవడంతో పాటు, స్వీయ అధ్యయనమే తనను కథకునిగా సాహితీ రంగంలో నిలుచోబెట్టిందన్నారు. ఇది రచయితలకు ఎంతో అవసరమన్నారు. తనకు అవార్డు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ మండలి చైర్మన్ ఎ.చక్రపాణి మాట్లాడుతూ రాజకీయాల్లో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసి ఎన్టీఆర్ పేదల గుండెల్లో నిలిచిపోయారన్నారు. తెలుగుజాతి చరిత్రలో ఆయనది విశిష్ట స్థానమన్నారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎన్. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు సంబంధించిన సమస్తం వారి కుమారులు, బంధువులు తీసుకెళ్లారన్నారు. తనకు మాత్రం ఆయనకు సేవ చేసే అవకాశం మిగిల్చారన్నారు. ఆ సేవాదృక్పథంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పారు. ఎన్టీఆర్‌కు సేవ, సాహిత్యం అంటే ఇష్టమన్నారు. అందుకే తెలుగువారికే కాకుండా అంతర్జాతీయంగా ఇతర భాషల్లోని సాహితీవేత్తలను సత్కరిస్తున్నామన్నారు. తన ఇల్లే కథా నిలయంగా భావించి సాహిత్యానికి సేవ చేస్తున్న డాక్టర్ కాళీపట్నం రామారావుకు ‘ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారం’తో సత్కరించి, రూ. లక్ష నగదు పురస్కారం అందజేస్తున్నామన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి తన ప్రసంగంలో ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ కె.ఐ. వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ తమిళనాడులో ఎంజీఆర్ పేరుతో మ్యూజియం ఉన్నట్లుగా ఇక్కడ ఎన్టీఆర్‌కు మ్యూజియం ఏర్పాటు చేయాలన్నారు. ‘యజ్ఞం’ కథ కాళీపట్నంకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా వరప్రసాదరెడ్డి తనవంతుగా రూ.లక్ష (రూపాయి తక్కువ) చెక్కును కాళీపట్నంకు అందజేశారు. ఆయన నిర్వహిస్తున్న కథా నిలయానికి దీన్ని విరాళంగా ప్రకటించారు. అనంతరం కాళీపట్నం రామారావుకు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రణతి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకొంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, ఎన్ఆర్ఐ డాక్టర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి, సినీనటుడు కోటా శ్రీనివాసరావు, సాహితీ వేత్తలు రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, సాహితీ వేత్త ఎ.ఎన్. జగన్నాథశర్మ తదితరులు పాల్గొన్నారు.