సుజల.. దాహం తీర్చేనా?
ఆరుగురుండే కుటుంబానికీ 20 లీటర్లే!
చాలకపోతే ఎలా సర్దుకోవాలి?
ఎన్టీఆర్ సుజల స్రవంతి పెలైట్ ప్రాజెక్టుగా కుప్పం
కుప్పం నియోజకవర్గంలో మొత్తం 16 ప్లాంట్లు మంజూరు
స్క్రాచ్ కార్డు సిస్టమ్తో శుద్దినీరు పంపిణీ
రోజుకు ఒక్కసారి మాత్రమే నీళ్లు
వైద్యుల సూచన ప్రకారం మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 6 లీటర్ల నీరు తాగాలి. ప్రతీ ఇంట్లో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారనుకున్నా కుటుంబంలో ఆరుగురు సభ్యులు ఉంటారు. వీరికి రోజుకు 36 లీటర్ల నీరు అవసరం. కానీ చంద్రబాబు సర్కారు మాత్రం స్క్రాచ్కార్డు అమలు చేసి రోజుకు 20 లీటర్లు మాత్రమే ఇస్తుందట. అంతకు మించి చుక్కనీరు ఇవ్వదట. దీనికి ‘స్కాచ్ సిస్టమ్’ అమలు చేస్తున్నారు. తాగే మంచినీళ్లకు కూడా రేషన్ విధిస్తుంటే ‘సుజల’ ద్వారా జనాల దప్పిక ఏ మేరకు తీరుతుందో ఇట్టే తెలుస్తోంది.
చిత్తూరు(టౌన్): జిల్లాలో ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పథకాన్ని ప్రభుత్వం చేపడుతోంది. 14 నియోజకవర్గాలకు కలిపి రూ.53 కోట్లు కేటాయించగా ఒక్కకుప్పం నియోజకవర్గంలో మాత్ర మే రూ.20 కోట్లతో పనులు చేపడుతున్నారు. నియోజకవర్గానికో చోట ఈ పథకాన్ని ఏర్పాటు చేసి ఆక్టోబర్ 2న జిల్లా వ్యాప్తంగా వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం యోచించింది. అయితే తక్కువ సమయం ఉండడంతో అది సాధ్యం కాదనుకుని తొలుత సీఎం నియోజకవర్గమైన కుప్పంలోని దళవాయికొత్తపల్లె చెరువులో పెలై ట్ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న ప్లాంటును మాత్రమే సీఎం చేత అక్టోబర్ 2న ప్రారంభించేట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసిం ది.
ఈ మేరకు కుప్పం నియోజకవర్గంలో రూ.20 కోట్లతో 16 ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక ప్లాంటుకు గంటకు 20 వేల లీటర్ల నీరు అవసరం. దానికోసమే ఒక్కో ప్లాంటు పరిధిలో విధి గా అయిదేసి బోర్లను డ్రిల్ చేస్తున్నారు. తొలుత దళవాయికొత్తపల్లె చెరువులో ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న ప్లాంటును పెలైట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక్కడ నాలుగు బోర్లు వేశారు. అయిదో బోరు డ్రిల్ చేయనున్నారు. జిల్లాలోని మిగిలిన 13 నియోజకవర్గాల్లో ప్లాంట్ల ఏర్పాటును స్విస్ టెక్ కంపెనీ చేపడుతోంది. కుప్పంలో మాత్రం ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా పనులు చేపడుతున్నట్టు ఆ కంపెనీ కన్సల్టెంట్ శ్రీనివాస్ తెలిపారు.
20 గ్రామాలకు ఒక ప్లాంటు
కుప్పంలో అమలు చేస్తున్న ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద 20 గ్రామాలకు ఒక ప్లాం టు చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ మినీ ట్యాంకులు నిర్మిస్తారు. ప్లాంటులో శుద్దిచేసిన నీటిని ట్యాంకర్ల ద్వారా దానిపరిధిలోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన మినీ ట్యాంకుల్లో నింపుతారు. ఆ తర్వాత మినీట్యాంకుల ద్వారా అన్ని గ్రామాల ప్రజలకు కొత్త టెక్నాలజీ ద్వారా సరఫరా చేస్తారు. దీనికోసం ఒక్కో ప్లాంటు పరిధిలో నాలుగేసి ట్రాక్టర్లను కూడా కొనుగోలు చేయనున్నారు.
స్క్రాచ్ సిస్టమ్తో నీటి సరఫరా
ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద కొత్త టెక్నాలజీని తొలుత కుప్పం నుంచే అవలంబించనున్నారు. నీటిని స్క్రాచింగ్ విధానంలో సరఫరా చేస్తారు. దానికోసం ముందుగా స్క్రాచ్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్డు ద్వారా ఒకసారి స్క్రాచ్చేస్తే 20 లీటర్లు మాత్రమే ట్యాంకు నుంచి విడుదలవుతుంది. ఇలా రోజులో ఒక్కసారి మాత్రమే స్క్రాచ్కార్డు పనిచేస్తుంది. అంటే రోజుకు ఒక కుటుంబానికి 20 లీటర్లు మాత్రమే ఇస్తారు. ఈ నీరు ఎక్కువమంది సభ్యులున్న కుటుంబానికి సరిపోదని ప్రజలు అంటున్నారు. తాగే మంచినీటిని కూడా చాలీచాలకుండా ఇవ్వ డం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పథకం ప్రజల దాహార్తిని ఏమాత్రం తీర్చదని అంటున్నారు.