ప్లేబాయ్‌లో.. ఇక ఆ బొమ్మలుండవు
న్యూయార్క్: 'పెద్దలకు మాత్రమే' వంటి శృంగార చిత్రాల తరహాలో.. కుర్రకారుకు మతులు పోగొట్టిన 'ప్లేబాయ్' మేగజైన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేగజైన్లో మహిళల నగ్న చిత్రాలు ప్రచురించరాదని యాజమాన్యం నిర్ణయించింది. రీ డిజైన్ చేసిన కొత్త మేగజైన్‌ను వచ్చే మార్చిలో ఆవిష్కరించనున్నారు.
ప్రస్తుత ప్లేబాయ్ ఎడిషన్‌లో రెచ్చగొట్టేలా మహిళ నగ్న చిత్రాలున్నా.. ఇక మీదట పూర్తి నగ్నచిత్రాలు కనిపించవు. ఈ మేగజైన్లో మహిళల నగ్న చిత్రాలను ప్రచురించరాదని ఎడిటర్ కోరీ జోన్స్ ప్రతిపాదించగా, ఇందుకు వ్యవస్థాపకుడు హూగ్ హెఫ్నర్ అంగీకారం తెలిపారు. ఇంటర్నెట్లో పోర్న్, నగ్నచిత్రాలు ఇబ్బడిముబ్బడిగా ఉండటంతో.. అడల్ట్ మేగజైన్లకు ఆదరణ తగ్గుతోందని ప్లేబాయ్ ప్రతినిధులు అంగీకరించారు. ప్లేబాయ్ సర్క్యులేషన్ భారీగా పడిపోయినట్టు చెప్పారు. 1975లో ప్లేబాయ్ సర్క్యులేషన్ 56 లక్షలు ఉండగా, ప్రస్తుతం 8 లక్షలకు పడిపోయింది.