ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల తరగతుల బహిష్కరణ
వేంపల్లె: ఇంటర్న్‌షిప్ వ్యవధి తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మంగళవారం తరగతులను బహిష్కరించారు. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో చివరి రెండేళ్లలో ఇంటర్న్‌షిప్ పేరిట కొద్ది రోజులు కళాశాల వెలుపల ప్రాజెక్టు వర్క్ చేయాలని ఇటీవల నిబంధనలు రూపొందించారు. ఇప్పటి వరకు చివరి ఏడాది మాత్రమే ఇంటర్న్‌షిప్ విధానం అమల్లో ఉంది. ఈ విషయంపై వారం రోజులుగా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు నిరసన చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఈ1, ఈ2, ఈ3 విద్యార్థులు సైతం మంగళవారం తరగతులు బహిష్కరించి ల్యాబ్ కాంప్లెక్స్‌లో సమావేశమయ్యారు. ఈ4 విద్యార్థులు మాత్రం వారాంతపు పరీక్షకు హాజరయ్యారు. రెండు మార్లు ఇంటర్న్‌షిప్ తమకు భారం అని విద్యార్థులు వాదిస్తుండగా, సులభంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని అధ్యాపక వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ నిబంధన తప్పనిసరి కాదని, ఇష్టం లేని వారు ఇక్కడే ఉండి చదువుకోచ్చని అధ్యాపకులు అంటున్నారు.