ఆ కోళ్లకు జీడిపప్పుతో గుడ్ మార్నింగ్!
సంక్రాంతి వస్తోందంటే చాలు.. కోడిపందాల జోరు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పందేల్లో తలపడే కోళ్లకు ఎక్కడలేని డిమాండ్ ఉంటుంది. పౌరుషం రావడం కోసం రకరకాల ఆహారాలు పెడతారు. మరి అలాంటి కోళ్ల రేట్లు కూడా మామూలుగా ఉండవు కదా. అందుకే విశాఖ జిల్లా నక్కపల్లిలో ఓ యువకుడు ఈ కోళ్ల పెంపకాన్నే వృత్తిగా పెట్టుకున్నాడు. అతడిపేరు నూకనాయుడు. వివిధ జాతులకు చెందిన కోళ్లను పెంచుతూ వాటిని పందెంకోళ్లుగా తీర్చి దిద్దుతున్నారు.
వాటికి జీడిపప్పుతో గుడ్మార్నింగ్ చెప్పి.. తర్వాత బాదం పప్పు, పిస్తా పప్పు, ఉడకపెట్టిన గుడ్లు, జొన్నలు, రాగులు ఇలా ప్రొటీన్ ఫుడ్డునే ఆహారంగా ఇస్తున్నాడు. ఇంటర్మీడియట్ చదివిన నూకనాయుడు... స్వయం ఉపాధిగా ఈ కోళ్ల పెంపకాన్ని ఎంచుకున్నాడు. డ్రైఫ్రూట్స్ పెట్టి పెంచుతున్న ఈ కోళ్లను... సైజును బట్టి 5 వేల నుంచి 50వేల రూపాయల వరకు అమ్ముకుంటున్నారు. సంక్రాంత్రి దగ్గరపడటం.. కోడిపందాలు జోరందుకోవడంతో నూకనాయుడు కోళ్లకు గిరాకీ పెరుగుతోంది. ధర ఎంతైనా సరే... ఇలాంటి పుంజులే కావాలంటున్నారు పందెంరాయుళ్లు.