జల ఖడ్గానికి ఆరుగురు బలి
(న్యూస్‌లైన్ నెట్వర్క్) : భారీ వర్షాలు విశాఖ జిల్లాలో ఆరుగురి ప్రాణాలు బలిగొన్నాయి. కశింకోట, జి.మాడుగుల మండలాల్లో చెరో ఇద్దరు మృతి చెందారు. దేవరాపల్లి, బుచ్చెయ్యపేట, పాడేరు మండలాల్లో చెరొకరు అసువులు బాశారు. మత్స్యగెడ్డలో ఒకరు గల్లంతయ్యారు. కశింకోట మండలం తాళ్లపాలెం సంత వద్ద మామిడివాక గెడ్డ ఉప్పొం గి కందుల మహేశ్వరరావు (70) ఇంటిని చుట్టు ముట్టింది.
లఘుశంకకు వెళ్లిన మహేశ్వరరావు గెడ్డ నీటిలో జారిపడి కొట్టుకుపోయి మునిగి మృతి చెందాడు. తాళ్లపాలెం శివారు బంగారయ్యపేట గ్రామంలో బహిర్భూమికి వెళ్లిన చలపాక నూకరత్నం (40) కొండ గె డ్డలో జారిపడి మృతిచెందింది. మహేశ్వరరావు చిల్లర దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య, బుద్ధి మాంద్యం ఉన్న ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జి.మాడుగుల మండ లం సొలభం పంచాయతీ కొత్తకుండలు గ్రామంలో గోడ కూలి గంగపూజారి చిలకమ్మ (60) కన్నుమూసింది.
ఇదే పంచాయతీలో ఎస్.కొత్తూరుకు చెందిన రొబ్బా గౌరమ్మ (50) కొండకు వంటచెరకు కోసం వెళ్లి బాగా తడిసిపోయిం ది. చలితో వణుకుతూ చనిపోయింది. బుచ్చెయ్యపేట మండలం వడ్డాదికి చెందిన మోటూరి అప్పారావు (55) ఇంట్లో నిద్రిస్తూ ఉండగా, గోడ అతని పై కూలిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దేవరాపల్లి మండలం ముషిడిపల్లికి చెందిన కర్రి అప్పారావు (45) గ్రామ సమీపంలోని ఎక్కన్నబంద వద్దకు ఉదయం బహిర్భూమికి వెళ్లాడు. కాళ్లు కడుక్కుంటుండగా ప్రమాదవశా త్తూ బందలోకి జారిపడ్డాడు. ఈత రాకపోవడంతో దుర్మరణం పాలయ్యాడు. మధ్యాహ్నానికి మృతదేహం తేలింది.
మత్స్యగెడ్డలో గిరిజనుడి గల్లంతు
పాడేరు మండలంలోని బొక్కెళ్లు కాజ్వే వద్ద మత్స్యగెడ్డలో ఓ గిరిజనుడు కొట్టుకు పోయాడు. గెడ్డ పొంగి ప్రవహిస్తున్నప్పటికీ దాటేందుకు ప్రయత్నించిన ఇరడాపల్లి కొత్తూరు గ్రామస్తుడు ముదిలి సూర్యనారాయణ(45) గల్లంతయ్యా డు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సంఘటన జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్రామస్తులంతా మత్స్యగెడ్డ సమీప ప్రాంతాలన్నీ గాలించినప్పటికీ సూర్యనారాయణ ఆచూకీ కానరాలేదు.