భర్త మృతిపై భార్య అనుమానం
కశింకోట,న్యూస్‌లైన్: భర్త మృతిపై అనుమానాలున్నాయని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శవ దహనాన్ని అర్థంతరంగా నిలిపి వేశారు. శవానికి పంచనామా జరిపి మళ్లీ దహన సంస్కారాలు చేశారు. నరసింగబిల్లికి చెందిన కోన నూకినాయుడు(70)కు, అదే గ్రామానికి చెందిన మేనమామ కుమార్తె మాణిక్యంతో 40 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి 30 ఏళ్ల కిందట సత్యవేణి అనే ఏైకైక కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో నూకినాయుడుతో విడిపోయి మాణిక్యం దూరంగా ఉంటోంది. దీంతో కుమార్తెనపు పెంచి, పెళ్లి చేసి అల్లుడ్ని ఇల్లరికం తెచ్చుకొని నూకినాయుడు జీవనం సాగిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో 2011లో పక్షవాతం వచ్చి నూకినాయుడు మంచాన పడటంతో తన పేరున ఉన్న సుమారు ఎకరం భూమిని కుమార్తె పేరున రాశారు. ఈ విషయం తెలియడంతో మాణిక్యం కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో నూకునాయుడు శనివారం మృతి చెందారు. ఈ విషయం అదే గ్రామంలో ఉంటున్న మాణిక్యంకు తెలియజేయలేదు.
శవాన్ని దహనానికి తీసుకెళుతుండగా శవాన్ని చూపాలని మాణిక్యం అడ్డుకొంది. దీంతో ఇది సంప్రదాయం కాదంటూ అల్లుడు, బంధువులు శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లి దహన సంస్కారాలు జరిపించారు. దీంతో శవాన్ని తనకు చూపించలేదని, తనపై చేయి చేసుకున్నారని, భర్త మృతిపై అనుమానాలున్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ విజయకుమార్, తహశీల్దార్ కె.రమామణిల ఆధ్వర్యంలో పోలీసులు శ్మశానానికి చేరుకొని కాలుతున్న శవాన్ని నీటితో అర్పించి, పోస్టుమార్టం జరిపించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పంచనామా అనంతరం నూకునాయుడు శవాన్ని దహనం చేశారు.