ఒక్కడే పిల్లగాడు..
♦ అంగన్వాడీ కేంద్రంలో ఒకే చిన్నారి
♦ కేంద్రాల్లో గణనీయంగా తగ్గుతున్న పిల్లల సంఖ్య
♦ అంగన్వాడీ ప్రీస్కూల్లోనూ అదే పరిస్థితి
విజయనగరం ఫోర్ట్:
ఈ రెండు కేంద్రాలేకాదు అధికశాతం కేంద్రాల్లో ఇదే పరిస్థితి. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. దీనికి తోడు అంగన్వాడీలు కూడా సమయ పాలన పాటించడం లేదు. దీనితో లబ్ధిదారులకు అందాల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 2977 మెయిన్ అంగన్వాడీ, 730 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో లక్ష 80 వేల మంది వరకు పిల్లలు ఉన్నారు.
సగం మందైనా లేరు..
అంగన్వాడీ కేంద్రాల్లో ఉండాల్సిన దాంట్లో సగం మంది కూడా కేంద్రాల్లో ఉండడం లేదు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతంలోనూ అదే పరిస్థితి. పిల్లల సంఖ్యను పెంచడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. కాని వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. కేంద్రాల్లో ఒకరు, ఇద్దరు కంటే పిల్లలు ఉండడం లేదు.
సమయపాలన పాటించని వైనం
అంగన్వాడీ కేంద్రాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలి. కొంత మంది కేంద్రాలను ఉదయం 10 గంటలకు తెరుస్తున్నారు. మధ్యాహ్నం 2, 3 గంటలకే కేంద్రాలను మూసేస్తున్నారు. పైన ఫొటోలో కనిపిస్తున్న అంగన్వాడీ కేంద్రం విజయనగరం మండలంలోని దుప్పాడ గ్రామంలోని ఒకటో అంగన్వాడీ కేంద్రం. 10:30 గంటల సమయంలో ఈ కేంద్రంలో ఒకే ఒక్క పిల్లవాడు ఉన్నాడు. ఈ కేంద్రంలో 15 మంది పిల్లలు ఉండాల్సి ఉండగా ఒక్కడే కేంద్రానికి హాజరుయ్యాడు.
ఈ ఫోటోలో కనిపిస్తున్న అంగన్వాడీ ప్రీస్కూల్ విజయనగరం మండలం అయ్యన్నపేట గ్రామంలోనిది. ఈ గ్రామంలో నాలుగు అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిని విలీనం చేసి అంగన్వాడీ ప్రీస్కూల్గా మార్పు చేసి ఒకేచోట నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రంలో 89 మంది పిల్లలు ఉండాల్సి ఉండగా కేవలం 8 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు.
చర్యలు తీసుకుంటాం..
పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న కేంద్రాలపై చర్యలు తీసుకుంటాం. సమయ పాలన పాటించని అంగన్వాడీలపై చర్యలు తీసుకుంటాం. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. ఏఈరాబర్ట్స్, పీడీ, ఐసీడీఎస్