Nurpulu
-
పాతాళంలో.. దిగుబడి!
శ్రీకాకుళం పాతబస్టాండ్ : అన్నీ సక్రమంగా సాగి.. వాతావరణం అనుకూలించి ఉంటే.. సుమారు 34 బస్తాల దిగుబడిని కళ్లజూడాల్సిన రైతు వరుస విపత్తులతో సగటున 16 బస్తాలకు మించి చేతికందక గుడ్ల నీరు కక్కుతున్నాడు. దిగుబడులు లేక.. చేసిన అప్పులు తీరక.. కష్టాల పాతాళంలో కూరుకుపోతున్నాడు. తక్కువ దిగుబడి వచ్చిన సందర్భాల్లో పంటల బీమా వర్తించాల్సి ఉంది. అయితే రుణమాఫీ మాయలో పడి బకాయిలు చెల్లించకపోవడంతో రుణాలు రీషెడ్యూల్ కాలేదు. దాంతో పంటల బీమా కూడా వర్తించే పరిస్థితి లేదు. హుద్‌హుద్ తుపాను, వెంటనే వచ్చిన వరదలు, సుడిదోమ తెగులు.. ఇవన్నీ చాలవన్నట్లు రుణమాఫీ విషయంలో సర్కారు నిర్వాకం వెరసి అన్నదాతను అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. సగటు దిగుబడి 16 బస్తాలే.. జిల్లాలో ఖరీఫ్ వరి దిగుబడి సగటున 16 బస్తాలు మాత్రమే వస్తుందని వ్యవసాయ అధికారులు నిర్వహించిన పంట కోత ప్రయోగాల్లో తేలింది. ఇప్పటికే నూర్పులు పూర్తి చేసిన రైతులకు దక్కింది కూడా సుమారుగా అంతే ఉంది. ఖరీఫ్‌లో జిల్లాలో సుమారు 2 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. పంట కోతలు జరుగుతున్న సమయంలో జాతీయ వంటల భీమా పథకం సిబ్బంది పాలకొండ డివిజన్లో 339, టెక్కలి డివిజిన్లో 356, శ్రీకాకుళం డివిజన్లో 294.. మొత్తం 989 యూనిట్లలో 4130 పంట కోత ప్రయోగాలు నిర్వహించారు. ఈ ప్రయోగాల ఫలితాల ప్రకారం జిల్లా సగటు దిగుబడి ఎకరాకు 16 బస్తాలని నిర్థారణ అయ్యింది. జిల్లా సాధారణ దిగుబడి 30 నుంచి 34 బస్తాలు కాగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా సగానికి పడిపోయింది. అత్యల్పంగా మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో 9 బస్తాల దిగుబడే వచ్చింది. సంతబొమ్మాళిలో 11 బస్తాలు, సీతంపేట, జి.సిగడాం, శ్రీకాకుళం, నందిగాం మండలాల్లో 12 బస్తాలు, కవిటి, గార, ఎచ్చెర్ల, లావేరు మండలాల్లో 13 బస్తాలు, పాతపట్నం, జలుమూరు మండలాల్లో 20, సారవకోటలో 22, వీరఘట్టం మండలంలో 23 బస్తాల దిగుబడి వస్తుందని తేలింది. వరుస విపత్తులు ఈ ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతులపై వరుసగా కష్టాలు దాడి చేశాయి. పంట పొట్ట దశలో ఉండగా అక్టోబర్ 12న పెను తుపాన్ హూద్‌హుద్ దాడి చేసింది. ఆ వెంటనే నాగావళి వరదలు ముంచెత్తాయి. ఆ తర్వాత సుడిదోమ దాడి చేసి పండిన అరకొర పంటలను కూడా నాశనం చేసింది. దీంతో తీర, మైదాన ప్రాంతాలు అన్న తేడా లేకుండా అన్ని చోట్లా వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట నష్టం వాటిల్లి దిగుబడులు తగ్గినప్పుడు పంటల బీమా పథకం రైతులను కొంతలో కొంత ఆదుకునేది. ఈ ఏడాది ఆ అవకాశం కూడా లేదు. సీజన్ ప్రారంభంలోనే పంట రుణాలు తీసుకునే రైతుల పేరిట బ్యాంకర్లు నేరుగా బీమా ప్రీమియం చెల్లిస్తారు. నష్టం జరిగినప్పుడు బీమా సంస్థల నుంచి పరిహారం అందుతుంది. ఈ ఏడాది మాత్రం అలా జరగలేదు. రుణమాపీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు పాత బకాయిలు చెల్లించలేదు. దాంతో కొత్త రుణాలు తీసుకునే అవకాశం లేకపోయింది. బీమా ప్రీమియం కూడా చెల్లించే పరిస్థితి లేకపోయింది. ఫలితంగా ఈ కష్ట సమయంలో బీమా సాయం అందకుండాపోయింది. -
కళ్లాల్లో ధాన్యం...కళ్లల్లో దైన్యం !
ఖరీఫ్ తరువాత రబీలో వేసిన మినుము, పెసర పూత దశకు వచ్చాయి. కోసిన వరి పంట ఇంకా కళ్లాల్లోనే ఉంది. కొన్ని చోట్ల నూర్పులు నూరుస్తున్నారు. ఈ తరుణంలో రెండు రోజుల నుంచి ముసురు పట్టుకుంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల ధాన్యం తడిసి ముద్దయి పోయాయి. పొలాల్లో ఉన్న పంటలకు తెగుళ్లు సోకే అవకాశం ఉంది. దీంతో అన్నదాత తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. రెండు రోజుల నుంచి బితుకుబితుకుమని గడుపుతున్నాడు. తుపాను ప్రభావం బుధవారం కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో మరింత ఆందోళనకు గురవుతున్నాడు. విజయనగరం వ్యవసాయం : తుపాను రైతన్నను వణికిస్తోంది. ఇప్పటికే నూర్పులు చేసిన ధాన్యం కళ్లాల్లో నిల్వ ఉండగా, మరి కొందరు నూర్పులు చేస్తున్నారు. ఈ సమయంలో బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణం గా సోమవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల కొన్ని చోట్ల ధాన్యం తడిసిపోయాయి. జిల్లాలో లక్షా 20 వేల ెహ క్టార్లలో వరి పంటసాగైయింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా లక్షా 17 వేల హెక్టార్లలో పంటను కోసేశారు. చాలా వరకు కుప్పలు కూడా పెట్టేశారు. మూడు వేల హె క్టార్లలో నాట్లు ఆలస్యమవడంతో ఇప్పుడు కోతలు ప్రారం భించారు. ధాన్యం చేతికి వచ్చే కీలకమైన సమయంలో వర్షాలు పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకోడానికి పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే నూర్పులు అయిన ధాన్యాన్ని వర్షంలోనే ఇళ్లకు తరలిస్తున్నారు. పరదాలు కప్పి పంటను కాపాడు కోడానికి నానా పాట్లు పడుతున్నారు. మరో వైపు తమపై కరుణిం చాలని, వర్షం పడకుండా చూడాలని దేవుడిని వేడుకుంటున్నారు. వర్షాలకు ధాన్యం తడిసి పోవడంతో రంగుమారే ప్రమాదం ఏర్పడింది. గంట్యాడ,విజయనగరం, జామి, ఎల్.కోట, బొండపల్లి,గజపతినగరం తదితర మండలాల్లో రైతులు నూర్పులు చేస్తున్నారు. చాలా చోట్ల ధాన్యం తడిసి ముద్దయిపోయాయి. అపరాలుకూ నష్టమే... తుపాను ప్రభావం బుధవారం కూడా ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో వరి పం ట కలిసిరాకపోవడంతో రైతులు అపరాలపైనే ఆశలు పెంచుకున్నారు. అయితే వర్షాలు పడుతుండడం వల్ల సాగులో ఉన్న మినుము, పెసర పంటలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాలు కొనసాగితే నీరు నిల్వ ఉండి మొక్కలు చనిపోతాయని రైతులు భయపడుతున్నారు. అవస్థలు పడుతున్న జనం చలితీవ్రత చాలా ఎక్కువుగా ఉంది. దీనికి తోడు చల్లటి గాలులు వీయడంతో జనం అల్లాడిపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగులు, కూలీలు విధులకు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు మిల్లీమీటర్లలో.... మండలం వర్షపాతం కొత్తవలస 21.4 మెరకముడిదాం 8.2 దత్తిరాజేరు 5.2 బొండపల్లి 18.2 గజపతినగరం 19.4 గుర్ల 15.2 గరివిడి 12.2 జామి 19.2 ఎల్.కోట 16.2 వేపాడ 9.6 ఎస్.కోట 2.4 చీపరుపల్లి 7.2 నెల్లిమర్ల 9.2 పూసపాటిరేగ 4.8 భోగాపురం 3.8 డెంకాడ 20.2 విజయనగరం 16.4 గంట్యాడ 7.4 తెర్లాం 4.2