సూపరింటెండెంట్ వేధింపులతో.. హెడ్నర్స్ ఆత్మహత్యాయత్నం
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో హెడ్ నర్సు ఆంథోనమ్మ శనివారం ఆస్పత్రిలోనే స్పిరిట్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఆస్పత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్ వేధింపుల కారణంగా తాను ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితురాలు పేర్కొన్నారు. వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం 8.40 నిమిషాలకు హెడ్ నర్సు ఆంథోనమ్మ ఆస్పత్రికి వచ్చి వార్డులో రౌండింగ్‌కు వెళ్లింది. ఆంథోనమ్మ ఫీమేట్ సర్జికల్ వార్డులో డ్యూటీ చేస్తుండగా జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ సుబ్బయ్య తన చాంబర్‌కు పిలిపించారు. డ్యూటీకి ఆలస్యంగా పది గంటలకు ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. తాను ఆలస్యంగా రాలేదని, 8.40 నిమిషాలకే డ్యూటీకి వచ్చానని ఆమె వివరణ ఇవ్వగా.. నర్సింగ్ సూపరింటెండెంట్ తనకు ఫిర్యాదు చేసిందని ఆయన తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన ఆంథోనమ్మ ఫిమేల్ సర్జికల్ వార్డులో ఉన్న స్పిరిట్‌ను తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను గమనించిన తోటి నర్సింగ్ సిబ్బంది చికిత్స చేసేందుకు యత్నించగా నిరాకరించింది. దీంతో నర్సింగ్ సూపరింటెండెంట్ సుగుణ, ఆర్ఎంఓ శోభాదేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ సుబ్బయ్య అక్కడకు చేరుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు. ఈ దృశ్యాలను విలేకరులు ఫొటోలు తీస్తుండగా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వచ్చి చిన్నచిన్న విషయాలను ఫొటోలు తీయడం మంచిది కాదని, మరోసారి ఆస్పత్రికి రావద్దని విలేకరులతో అన్నారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
నర్సింగ్ సూపరింటెండెంట్ సుగుణ తనపై నిఘా ఉంచి ప్రతీ పదినిమిషాలకు ఎం చేస్తోందో గమనించమని అంటోందని, ఈ విషయంపై పది రోజుల క్రితం ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు హెడ్ నర్సు ఆంథోనమ్మ తెలిపారు. తాను ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని, నర్సింగ్ సూపరింటెండెంట్ ఫిర్యాదు చేసిందని ప్రతి సారి తనను పిలిచి వివరణ అడుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేసింది. నిజాయితీగా పనిచేసే వారిని వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపింది. తాను 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నానని, తనపై అధికారులు ఎవరూ ఆమెలా ప్రవర్తించలేదని ఆవేదన వ్యక్తంచేసింది.
నర్సింగ్ సూపరింటెండెంట్‌కు, సిబ్బందికి వాగ్వాదం
ఆంథోనమ్మ ఆత్మహత్యాయత్నానికి నర్సింగ్ సూపరింటెండెంట్ వైఖరే కారణమని నర్సింగ్ సిబ్బంది కొంతమంది ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఆర్ఎంఓ శోభాదేవి, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సుబ్బయ్య ఇరువర్గాల వారికి నచ్చచెప్పి అక్కడినుంచి పంపించారు.
ఇది చిన్న విషయమే: సూపరింటెండెంట్ సుబ్బయ్య
ఆంథోనమ్మ ఆత్మహత్యాయత్నం చిన్న సంఘటనే. దీనిని విలేకరులు పెద్దది చేయొద్దు. ఆస్పత్రిలో ఈ వివాదాన్ని పరిష్కరిస్తాం.