ఆటో నడుపుతుండగా ఆగిన డ్రైవర్ గుండె
తిమ్మాపూర్ : ఆటో నడుపుతూనే డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మండలంలోని నుస్తులాపూర్ వద్ద గురువారం జరిగింది. కొహెడకు చెందిన మామిడి మురళి(55) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం కొహెడ నుంచి కరీంనగర్‌కు వచ్చిన ఆయన ఆటోలో ప్రయాణికులతో తిరుగుపయనమయ్యాడు. నుస్తులాపూర్ స్టేజీ దాటిన తరువాత కొంతదూరం నెమ్మదిగా నడుపుతూ ఆటోను రోడ్డు దింపాడు. రోడ్డు పక్కన ఉన్న టైర్ పంక్చర్ షాప్ వద్దకు వెళ్లి అక్కడున్న మిషన్ తాకి నిలిచిపోయింది. డ్రైవర్ మురళిలో ఆటోనే వెనక్కి ఒరిగి మృతిచెందాడు. అందులో ఉన్న ప్రయాణికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబసభ్యులు అదే ఆటోలో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఎల్ఎండీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు.
వారం రోజుల్లో ఇద్దరు డ్రైవర్లు...
వారం రోజుల్లో కొహెడ మండలానికి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లు తిమ్మాపూర్ మండలంలో మృతి చెందారు. ఆగస్టు 25న ఇందిరానగర్ వద్ద ఆటోను కారు ఢీకొనగా కొహెడకు చెందిన ఆటో డ్రైవర్ బస్వరాజు శ్రీనివాస్ మృతి చెందాడు. ఆయన కర్మ కోసం ప్లేట్లు, గ్లాసులు, ఇతర వస్తువులు తీసుకెళ్తున్న కొహెడకే చెందిన ఆటోడ్రైవర్ మామిడి మురళి గురువారం గుండెపోటుతో మృతి చెందాడు.