పదహారేళ్ల పగ
నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్: అండ్లపురి సోమలింగం ఇంట్లో 16 సంవత్సరాల క్రితం మొదటగా పశువులు, మేకలు మృతి చెందాయి. తల్లి రాములమ్మ అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆమె కోలుకుంది. తర్వాత 10 సంవత్సరాల క్రితం నిందితుడైన సోమలింగం మానసిక రోగిగా వ్యవహరించాడు. ఇతను ఎర్రగడ్డ ఆస్పత్రిలో కొంతకాలం చికిత్స పొందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇతని సోదరుడు నర్సింహ ఢిల్లీలో పోలీసు విభాగంలో పనిచేస్తున్న సమయంలో నర్సింహ తన భార్య మేఘన మధ్య చిన్న వివాదం జరిగింది. దీంతో భార్య మేఘన కిరోసిన్ పోసుకుని ఢిల్లీలోనే మృతి చెందింది. మృతదేహాన్ని రైల్లో ఇంటికి తీసుకువస్తుండగా రైల్లో నుండి అతని సోదరుడు నర్సింహ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత గ్రామంలో ఉంటే బాగుండడం లేదని తల్లి రాములమ్మ, తమ్ముని పిల్లలతో కలిసి నల్లగొండలో నివాసం ఉంటున్నది. రెండు సంవత్సరాల క్రితం తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
కుటుంబంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో మానసిక క్షోభకు గురై తన పిల్లలకు, తమ్ముని పిల్లలకు ఏమైనా చేస్తారనే అనుమానంతో ఐదు సంవత్సరాల క్రితం పేరం రాములు, గాదరి భిక్షమయ్యలపై దాడి చేశాడు. దీంతో పోలీసుస్టేషన్లో అండ్లపురి సోమలింగంపై కేసు నమోదైంది. మృతులు ఇద్దరు కులపెద్దలు కావడంతో గ్రామంలో సోమలింగం నివాసం ఉండవద్దని పంచాయతీ నిర్వహించారు. దీంతో నిందితుడు నల్లగొండలో నివాసం ఉంటున్నాడు. సోదరుని పిల్లలు, తండ్రి అండ్లపురి రాములు శేషమ్మగూడెంలో నివాసం ఉంటున్నారు.
శేషమ్మగూడేన్ని సందర్శించిన
జనవిజ్ఞాన వేదిక నాయకులు
మంత్రాలు, చేతబడి చేస్తున్నారని శేషమ్మగూడెం ఎస్టీ కాలనీలో ఇద్దరిని కొట్టి చంపడం హేయమని జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి బృందం పేర్కొన్నది. మంగళవారం జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. వెంకటరమణారెడ్డి, సహాయ కార్యదర్శి ఎస్కె.మస్తాన్, పట్టణ కార్యదర్శి వి. పంచలింగం గ్రామాన్ని సందర్శించారు. మంత్రాలు, మాయలు ఉండవన్నారు. మానసిక లోపంతో ఉన్న సోమలింగం తన కుటుంబ సభ్యుల మృతికి పేరం రాములు, భిక్షమయ్యలు కారణమనే నెపంతో ఉన్మాదిగా మారి హత్యకు పాల్పడ్డాడని అన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రజల్లో ఉన్న అపోహాలను తొలగించాలని కోరారు.