మెహెందీ కోన్ ఇలా!
బ్యూటిప్స్
మార్కెట్లో తెచ్చి, వాడే కోన్లలో రసాయనాలు హానికరంగా ఉండవచ్చు. అవి చర్మానికి సరిపడక అలెర్జీలకు కారణం అవచ్చు. అలాంటి సమస్య రాకుండా ఇంట్లోనే మెహెందీ కోన్ తయారుచేసుకోవచ్చు.కప్పు గోరింటాకు(మెహెందీ)పొడి (4 కోన్స్ తయారుచేసుకోవచ్చు), నైలాన్ వస్త్రంతో కనీసం రెండు మూడు సార్లు వడ కట్టాలి.
అర కప్పు నీటిలో టీ స్పూన్ తేయాకును కలిపి మరిగించాలి. నాలుగు రేకల చింతపండు, టీ స్పూన్ పంచదార కప్పు నీటిలో వేసి 10 నిమిషాలు ఉంచాలి. ఇవి అందుబాటులో లేకపోతే... మరిగించిన కాఫీ నీళ్లు, లవంగాలు మరిగించిన నీళ్లు, నిమ్మరసం వాడచ్చు. అలాగే, ఎండబెట్టిన నిమ్మ చెక్కలను మరిగించిన నీరు, వెనిగర్/ఆమ్ల రసం(అసిడిక్ లిక్విడ్) అన్నింటినీ కలిపి 10 నిమిషాలు ఉంచి, వడకట్టాలి.
ఈ నీటిలో కప్పు గోరింటాకు పొడి, పది చుక్కల యూకలిప్టస్ ఆయిల్, అంతే మోహిందీ ఆయిల్ కలపాలి. బాగా కలిపి ఈ మిశ్రమాన్ని గంటసేపు ఉంచాలి. మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ని కోన్ షేపులో చేసి, దాంట్లో మెహెందీ మిశ్రమాన్ని నింపాలి. 24 గంటలలోపు ఈ మిశ్రమాన్ని డిజైన్లుగా వేసుకోవాలి. ఈ మిశ్రమం ఫ్రిజ్‌లో పెడితే, 2-3 వారాల వరకు సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచి ఉపయోగించవచ్చు. మెహెందీ చల్లగా ఉంటే సరైన ఫలితం రాదు.
ఎర్రై డిజైన్..
డిజైన్ పొడిబారాక నిమ్మరసం, పంచదార కలిపిన రసంలో దూది ఉండను ముంచి, అద్దాలి. దీంతో డిజైన్ మరింత ఎరుపు రంగులోకి మారుతుంది. డిజైన్ పొడిబారాక వెంటనే నీళ్లతో కడిగేయకుండా బ్రష్‌తో శుభ్రపరచాలి. ఆలివ్/కొబ్బరి/నువ్వుల నూనెను రంగుపై అద్ది, మృదువుగా రాయాలి. ఇది చర్మానికి, డిజైన్‌కి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఇలా చేయడం ద్వారా హెన్నా వల్ల తలెత్తే చిన్న చిన్న చర్మ సమస్యలు తగ్గుతాయి.