విలేకరిపై దాడికి నిరసనగా రాస్తారోకో
ఓడీచెరువు (అనంతపురం జిల్లా) : ఓడీ చెరువు 'సాక్షి' విలేకరి చంద్రశేఖర్ రెడ్డిపై దాడికి నిరసనగా సీపీఐ, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఓడీ చెరువులో శనివారం రాస్తారోకోకు దిగారు. దాడికి పాల్పడిన రేషన్ డీలర్ యజమానిని వెంటనే అరెస్ట్ చేయాలని, డీలర్షిప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఓడీచెరువు మండలంలోని మహమ్మదాబాద్ క్రాసింగ్ వద్ద నున్న చౌక ధరల దుకాణం డీలర్ మానస తమకు సరుకులు సక్రమంగా ఇవ్వడంలేదని కార్డుదారులు ఫిర్యాదు చేశారు.
దీనిపై గురువారం డిప్యూటీ తహశీల్దార్ మహబూబ్పీరా గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. ఈ అంశాన్ని ‘సాక్షి’తో పాటు అన్ని పత్రికలూ ప్రచురించాయి. అయితే సాక్షిలో ఫోటోతో పాటు ప్రచురించారంటూ డీలర్ భర్త రాజశేఖరా చారి, అతడి అత్తమామలు మునిస్వామి, వెంకటలక్ష్మి శుక్రవారం సాక్షి విలేకరిపై దాడి చేసి దుర్భాషలాడారు. స్థానికులు కల్పించుకుని విలేకరిని కాపాడారు. దాడికి పాల్పడ్డ వారిపై బాధితుడు ఓడీ చెరువు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.