వీకెండ్ పార్టీలో అగ్నిప్రమాదం.. 33 మంది మృతి
అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో ఒక వీకెండ్ పార్టీ జరుగుతున్న భవనంలో మంటలు చెలరేగడంతో 33 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రెండు అంతస్థులలో ఉన్న ఈ భవనాన్ని ఒక కళాకారుడు తాను సేకరించిన పెయింటింగులను దాచుకోడానికి గోడౌన్‌గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. అందులో మంటలు చెలరేగడంతో మొత్తం భవనం అంతా బూడిద కుప్పగా మారింది. అందులోంచి సుమారు 12 మంది మృతదేహాలను వెలికితీశారు. అగ్నిప్రమాదం ఎందువల్ల సంభవించిందో ఇంకా తెలియలేదు. ఇందులో విద్రోహచర్య ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ భవనంలో తరచు సంగీత ప్రదర్శనలు కూడా జరుగుతుంటాయని, కానీ భవన నిర్మాణంలో నిబంధనలను మాత్రం అస్సలు పాటించలేదని అంటున్నారు.
ఆల్మెడా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఇప్పటికే అగ్నిప్రమాదానికి సంబంధించిన నేర విచారణను ప్రారంభించిందని మేయర్ లిబ్బీ స్కాఫ్ తెలిపారు. బాధితులు ఎవరో గుర్తించడం, వాళ్ల కుటుంబాలకు సమాచారం అందించడం తమ ప్రథమ కర్తవ్యమని మేయర్ చెప్పారు. ఏడు కుటుంబాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చామన్నారు. ఈ ప్రమాదం సరిగే సమయానికి భవనంలో ఎంతమంది ఉన్నారన్న విషయం ఇంకా తెలియలేదు. గతంలో 2003 సంవత్సరంలో రోడ్ ఐలండ్ నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 100 మంది మరణించారు. దాని తర్వాత జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదేనని చెబుతున్నారు.