ఆ తాబేళ్లు చనిపోవడానికి కారణం అదే
మెక్సికో :వాతావరణంలో చోటు చేసుకున్న మార్పు కారణంగా దాదాపు 300 అరుదైన ఆకుపచ్చ తాబేళ్లు చనిపోయిన ఘటన గురువారం మెక్సికో నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాబేళ్లు కొన్నివేళ సంవత్సరాలు బతుకుతాయన్న సంగతి మనందరికి తెలిసిన విషయమే. అయితే ప్రపంచంలోనే అరుదైన జాతుల్లో ఆకుపచ్చ తాబేళ్లు ఒకటి.1.5 మీటర్ల పొడవు పెరిగే అరుదైన ఆకుపచ్చ తాబేళ్లు సాధారణంగా మెక్సికో, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో కనిపిస్తుంటాయి. ఇవి ఎక్కువగా సముద్ర అడుగుభాగంలోనే ఉంటూ జీవిస్తుంటాయి. కాగా గత కొన్ని రోజులుగా మెక్సికోలోని ఒక్సాకా సముద్రం తీరంలో వాతావరణ మార్పులు చోటుచేసుకోవడంతో రెడ్ టైడల్ మైక్రోఆల్గే విపరీతంగా పెరిగిపోయింది.
రెడ్ టైడల్ ఆల్గే సముద్రంలో ఉండే సాల్ప్ అనే చిన్న చిన్న చేపలను తినేస్తుంటుంది. ఇది తాబేళ్లకు చాలా విషపూరితం, గత కొన్ని రోజులుగా మైక్రో ఆల్గేను తింటున్న ఆకుపచ్చ తాబేళ్లు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతున్నాయి. అయితే అరుదుగా కనిపించే ఆకుపచ్చ తాబేళ్లు ఇలా చనిపోవడంపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ' ఇప్పటివరకు మైక్రోఆల్గే బారీన పడి 297 తాబేళ్లు చనిపోయాయి. అయితే 27 తాబేళ్లను మాత్రం మైక్రోఆల్గే నుంచి కాపాడి తాబేళ్ల సంరక్షణ కేంద్రానికి తరలించాము. వాతావరణ పరిస్థితులు మెరుగుపడేవరకు అక్కడే పెంచుతామని ' పర్యావరణ అధికారులు వెల్లడించారు.