‘ఒబామా కేర్’పై ట్రంప్‌కు ఎదురుదెబ్బ
సొంత పార్టీలోనే వ్యతిరేకత
⇒ మెజార్టీ సభ్యులు లేక కొత్త వైద్య పాలసీపై చర్చ వాయిదా
⇒ బిల్లుకు మద్దతివ్వాలంటూ రిపబ్లికన్ సభ్యులకు ట్రంప్ అల్టిమేటం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సొంత పార్టీకి చెందిన రిపబ్లికన్ సభ్యులే షాకిచ్చారు. దీంతో ఒబామాకేర్ వైద్య పాలసీ స్థానంలో కొత్త పాలసీని ప్రవేశపెట్టాలన్న ట్రంప్ ఆశలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అమెరికన్ కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో గురువారం బిల్లుపై చర్చ సందర్భంగా మెజార్టీ సభ్యులు హాజరుకాకపోవడంతో స్పీకర్ చర్చను శుక్రవారానికి వాయిదా వేశారు. బిల్లు ఆమోదానికి తగినంత మంది సభ్యుల మద్దతు కూడగట్టడంలో సర్కారు విఫలమైంది. ట్రంప్ రంగంలోకి దిగి బిల్లుకు మద్దతివ్వాలంటూ రిపబ్లికన్ పార్టీ సభ్యులకు అల్టిమేటం జారీ చేశారు.
రిపబ్లికన్ సభ్యులతో భేటీ నిర్వహించి.. బిల్లుకు మద్దతివ్వకపోతే జరిగే పరిణామాల్ని వివరించారు. ఒబామాకేర్తో అధిక వ్యయంతో పాటు తక్కువ సదుపాయాలు అందుతున్నాయని.. ఇది కొనసాగితే పరిస్థితి దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో బిల్లు ఆమోదం పొందకపోతే ఇతర మార్గాల్లో దాన్ని ట్రంప్ అమలు చేస్తారని వైట్‌హౌస్ బడ్జెట్ డైరెక్టర్ మిక్ ముల్వనే హెచ్చరించారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, అందులో భాగమే ఈ కొత్త వైద్య పాలసీ అని వైట్‌హౌస్ పేర్కొంది. అయినప్పటికీ తగినంత మద్దతు లభించకపోవడంతో శుక్రవారం ఒబామా కేర్ స్థానంలో ప్రవేశపెట్టిన హెల్త్ కేర్ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
మనసు మాట వింటా!: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టైమ్ మ్యాగ్జైన్కు ప్రత్యేక ఇంటర్వూ్య ఇస్తున్న సమయంలో ‘నేనేమీ అంత చెడ్డగా నిర్ణయాలు తీసుకోవడం లేదు.. ఎందుకంటే నేను అమెరికా అధ్యక్షుడిని, నువ్వు కాదు’ అంటూ విలేకరిపై అసహనం వ్యక్తం చేశారు. ‘నేను స్వభావ సిద్ధంగా మనసు చెప్పేది చేసే తరహా వ్యక్తిని. ఆ విధంగా నేను తీసుకున్న నిర్ణయాలు దాదాపు అన్ని సందర్భాల్లోనూ నిజమయ్యాయి’ అని వివరించారు.
గతంలో చేసిన వివాదాస్పద ప్రకటనల్ని ఆయన సమర్థించుకున్నారు. ఎన్నికల సమయంలో ఒబామా ప్రభుత్వం తన ఫోన్ కాల్స్‌ని ట్యాప్ చేసిందని, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ట్రంప్ ఆరోపించారు. అలాగే బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రిటన్ ప్రజలు ఓటేస్తారని కూడా జోస్యం చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు రుజువవుతాయని, కమిటీ నివేదిక అనంతరం స్పందిస్తానని చెప్పారు. బ్రెగ్జిట్ విషయంలోను తన అంచనాయే నిజమైందన్నారు.