త్వరలో అందుబాటులోకి మల్టీ అబ్జెక్టివ్ ట్రాకింగ్ రాడార్
నెల్లూరు (సూళ్లూరుపేట) : సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లో మల్టీ ఆబ్జెక్టివ్ ట్రాకింగ్ రాడార్ వ్యవస్థ ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. రూ.250 కోట్లతో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో రాడార్ వ్యవస్థ ఏర్పాటుకు 2014లో శ్రీకారం చుట్టారు. ఈ తరహా కేంద్రం ప్రపంచంలో అగ్రరాజ్యాలతో పాటు ఇజ్రాయెల్‌కు మాత్రమే ఉంది. సరికొత్త రాడార్ ను 50 మంది ఇంజినీర్లు డిజైన్ చేయగా వందమంది ఇంజనీర్లు ఏర్పాటు పన్నుల్లో బిజీగా ఉన్నారు.
ఇందుకు సంబంధించిన కొన్ని పరికరాలు ఇటీవలే షార్కు చేరుకున్నాయి. ప్రస్తుతం శ్రీహరికోటలోని రాడార్లు రాకెట్ గమనాన్ని మాత్రమే ట్రాకింగ్ చేయగలవు. కొత్త కేంద్రం అందుబాటులోకొస్తే రాకెట్ శకలాలు ఎక్కడ పడేది, ఉపగ్రహాలు ఢీ కొట్టుకునే పరిస్థితి వస్తే వాటిని సరిచేసే టెక్నాలజీ అందుబాటులోకిరానుంది. కక్ష్యలో ఉపగ్రహాన్ని విడిచిపెట్టే ప్రక్రియను స్పష్టంగా చూడొచ్చు. అంతరిక్షంలో ఉపగ్రహాల శకలాలను తొలగించొచ్చు.