ఆ చిలుక నన్ను బండబూతులు తిడుతోంది..
అనగనగా ఒక రామచిలుక. దాని పేరు హరియాల్. ప్రతిరోజు యజమాని నేర్పే మాటలను అందంగా వల్లెవేస్తూ ఉంటుంది. ఇంటికి ఎవరొచ్చినా పలకరిస్తుంది. కానీ ఒక బామ్మ కనపడితేమాత్రం తిట్ల దండకం అందుకుంటుంది. మామూలుగా కాదు.. చెవులు తూట్లు పడేందతటి బూతులు తిడుతుంది.
అలా నెలలపాటు చిలుక తిట్లను భరించి.. సహనం కోల్పోయిన ఆ వృద్ధురాలు.. మొత్తం వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ ఆమె ఎవరు? చిలుక ఆమెను ఎందుకలా తిడుతోంది? మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో సోమవారం చోటుచేసుకున్న ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే..
85 ఏళ్ల జనాబాయి సకార్కర్ అనే వృద్ధురాలు చంద్రపూర్ జిల్లా రాజూరాలో నివసిస్తోంది. ఆమె ఇంటికి కొద్ది దూరంలోని మరో ఇంట్లో సవతి కొడుకు సురేశ్ ఉంటున్నాడు. సురేశ్ ఆ మధ్య ఓ చిలకను కొన్నాడు. అప్పటికే నాలుగైదు పదాలు పలకగల ఆ చిలుకకు బూతులు నేర్పాడు. జనాబాయి ఫొటోను చూపిస్తూ ఆమె కనిపించినప్పుడు బూతులు మాట్లాడేలా చిలుకకు శిక్షణ ఇచ్చాడు. అలా జనాబాయి కనిపించినప్పుడల్లా తిట్లతో ఆమెను అవమానించేది హరియాల్ చిలుక.
ఓ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో విబేధాలు తలెత్తడంతో జనాబాయికి, ఆమె సవతి కొడుకు సురేశ్ తో సయోధ్య చెడింది. అప్పటినుంచి ఆమెపై కక్ష గట్టిన సురేశ్ చిలుక అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు జానాబాయి, సురేశ్లతోపాటు హరియాల్ (చిలుక)ను కూడా స్టేషన్కు పిలిపించారు.
అక్కడ సీన్ మరింత ఆసక్తికరంగా మారింది. ఫిర్యాదులో పేర్కొన్నట్లు జనాబాయిని చూడగానే చిలుక తిట్టడం మొదలుపెట్టాలి. కానీ అప్పుడలా జరగలేదు. పోలీసులను గుర్తుపట్టిందో ఏమోగానీ స్టేషన్లో నోరుమెదపకుండా కూర్చుంది హరియాల్. దీంతో ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ కావాలా? అని తలపట్టుకున్నారు పోలీసులు!
సుదీర్ఘ ఆలోచన తర్వాత జనాబాయి మానసిక ఆందోళనలో న్యాయం ఉన్నదని గుర్తించి.. సదరు చిలుకను అటవీశాఖకు అప్పగించారు. సురేశ్, జనాబాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపేశారు.