‘ఓటుకు కోట్లు’ జుగుప్సాకరం
భ్రష్ట రాజకీయాలకు ఇది ప్రతీ
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తగదు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి
ఒంగోలు కల్చరల్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అడ్డదారులు తొక్కడంపై ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం జుగుప్సాకరమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చ అని, భ్రష్టరాజకీయాలకు ప్రతీకని నారాయణమూర్తి అభివర్ణించారు. ప్రజా కళాకారుడు డాక్టర్ గాండ్ల వెంకటరావు రెండో వర్ధంతి సభలో పాల్గొనేందుకు గురువారం ఒంగోలు వచ్చిన ఆర్.నారాయణమూర్తి ‘సాక్షి’తో వర్తమాన రాజకీయాలపై మాట్లాడారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో తప్పెవరిదో తేల్చకుండా రాజకీయ నాయకులు, పార్టీలు పరస్పరం ఆరోపణలకు దిగడాన్ని తప్పుబట్టారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు, చిచ్చుపెట్టేందుకు నాయకులు కుట్రలు పన్నుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే..
రాష్ట్రాన్ని విభ జించే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ హామీలిచ్చిన నాయకులు, పార్టీలు ప్రస్తుతం మాట మారుస్తున్నాయన్నారు. ఎన్నికల సయమంలో కూడా ప్రత్యేక హోదా సాధిస్తామంటూ పలు ప్రకటనలు చేశారని, అయినా నేటికీ హోదా దక్కలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.
ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఈ సిఫార్సులను తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేసి, ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.