సభను అడ్డుకుంటాం: సీమాంధ్ర కేంద్రమంత్రులు
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై నేడు లోక్సభలో చర్చ జరగనున్ననేపథ్యంలో సభ కార్యకలాపాలను అడ్డుకుంటామని సీమాంధ్ర కేంద్రమంత్రులు మంగళవారం స్పష్టం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బిల్లుపై చర్చ చేపట్టి సాయంత్రం కల్లా ముగించాలని ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 21తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందేందుకు చాలా తక్కువ సమయం ఉంది. అందుకోసం ప్రభుత్వం ఒక రోజు లోక్సభలో, మరో రోజు రాజ్యసభలో బిల్లుపై చర్చ చేపట్టి ఆమోదం పొందెలా ప్రభుత్వం తన చర్యలను ముమ్మరం చేసింది.
అయితే రాష్ట్ర విభజనపై సీమాంధ్ర కేంద్రమంత్రులు నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భం సదరు కేంద్ర మంత్రులు చేసిన ప్రతిపాదనలపై రాహుల్ మౌనం దాల్చినట్లు సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది. అయితే సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు చేసిన ప్రతిపాదనలు అధిష్టానం నిర్ద్వందంగా తొసిపుచ్చుతున్న సంగతి తెలిసిందే. దాంతో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సభా కార్యక్రమాలను అడ్డుకోవాలని సీమాంధ్ర కేంద్రమంత్రులు నిర్ణయించారు.