అప్పులు, అనారోగ్యంతో కౌలు రైతు ఆత్మహత్య
ఉరవకొండ రూరల్: పంట సాగుకు చేసిన అప్పులు.. తీవ్ర అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెందిన ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం అనంతపురం జిల్లా మోపిడి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నగేష్‌బాబు తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన బోయ ఓబుళప్ప(35) పెన్నహోబిళం ఆలయానికి చెందిన 8 ఎకరాల భూమిని కొన్నేళ్లుగా కౌలుకు సాగు చేస్తున్నాడు. గత మూడేళ్ల నుంచి వెరుశనగ పంట చేతికందకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. పొలంలోకి పైప్‌లైన్ వేసి పీఏబీఆర్ కాలువ నీటిని మళ్లించుకోవాలని ప్రయత్నించాడు.
ఇందుకోసం రూ. 2లక్షలు ఖర్చు చేశాడు. అయితే పైప్‌లైన్ ద్వారా నీరు రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. పంట కోసం బయటి వ్యక్తులతో చేసిన రూ.2లక్షలు, పైప్‌లైన్ వేయడానికి చేసిన మరో రూ.2లక్షల అప్పు తలకు మించిన భారంగా మారింది. రుణ ఒత్తిళ్లతో పాటు ఆస్తమా వ్యాధి తీవ్రత ఎక్కవ కావడంతో ఓబుళప్ప మంగళవారం రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్క నివాసితులు ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్యమహాలక్ష్మితో పాటు మైత్రి(9), నాగేంద్ర(8), అశోక్(5) సంతానం.