పీలేరుపై వైఎస్సార్సీపీ గురి
మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన పీలేరులో పట్టు సాధించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురిపెట్టింది. ఇందుకు ‘స్థానిక’ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే దిశగా పావులు కదుపుతోంది. కిరణ్‌కు రాజకీయంగా బద్దశత్రువైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనే సత్తా చాటేందుకు ద్వితీయశ్రేణి నాయకులను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా పీలేరు నియోజకవర్గంలో ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా ఏకగ్రీవం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
సాక్షి, తిరుపతి: మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి స్థానిక ఎన్నికల్లో అన్ని రకాలుగా చెక్ పెట్టారు. ఆయన సొంత ఎంపీటీసీ స్థానం పత్తేగడలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలిపింది. పీలేరు నియోజకవర్గంలో మొత్తం 82 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో కిరణ్ వర్గీయులు ఏడు పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సారి అలా జరగనివ్వకుండా అన్ని ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపారు.
దీంతో ఆ పార్టీ కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. ఇది ఈ ఎన్నికల్లో తొలి విజయం అన్నట్టుగా వారు సంబరపడుతున్నారు. జెడ్పీటీసీ స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను రంగంలోకి తీసుకురావడం ద్వారా వ్యక్తిగతంగా కిరణ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ సవాల్ విసిరింది. నియోజకవర్గంలోని మెజారిటీ జెడ్పీటీసీలను కైవసం చేసుకునే దిశగా ముమ్మరంగా కృషి చేస్తోంది.
కిరణ్ శిబిరం హెచ్చరికలు
నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శిబిరం నుంచి హెచ్చరికలు వెళ్తున్నాయి. ముఖ్యంగా కిరణ్ సీఎంగా ఉన్న సమయంలో లబ్ధి పొందినవారికి ఈ హెచ్చరికలు వెళ్తునట్టు తెలిసింది. అప్పట్లో కుల సంఘాల ద్వారా ఇళ్ల పట్టాలు, వ్యక్తిగత లబ్ధి చేకూర్చారు. ప్రస్తుతం అధికా రం లేనందున లబ్ధిదారులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపవచ్చన్న అనుమానం కిరణ్ వర్గం లో ఉంది.
దీంతో అప్పట్లో లబ్ధిపొందిన వారికి ఇటువంటి హెచ్చరికలు చేస్తున్నారు. అంతేకాకుండా కాం గ్రెస్ నాయకులుగా చెలామణి అవుతూ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడిన వారికి కూడా బెదిరింపులు వెళుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో కిరణ్ వర్గం తర ఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు అన్ని రకాలుగా సహాయ పడాల్సిందేనని మాజీ సీఎం సోదరుడు అల్టిమేటం జారీ చేశారు.
లేనట్టయితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని గట్టిగా హెచ్చరిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎన్ని ఎత్తులు వేసినా ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ తప్పదని మాజీ సీఎం సన్నిహితులు అంతర్గత సంభాషణల్లో కుండబద్దలు కొడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగా ఏకపక్ష ఫలితాలు ఆశించడం అత్యాశేనని వారు స్పష్టం చేస్తున్నారు.
కబ్జాల శ్రీనాథరెడ్డికి ఎన్నికల ప్రచారబాధ్యతలు
పీలేరు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువజేసే ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్టు విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథరెడ్డికి స్థానిక ఎన్నికల ప్రచారబాధ్యతలు అప్పగించారు. ఈ భూములను కాపాడుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి అండదండలు అవసరం కావడంతో ఆయన ఒక్కరే ప్రస్తుతం కిరణ్ వర్గం తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
స్థానిక ఎన్నికల్లో కిరణ్ వర్గీయులను గెలిపించుకోలేకపోతే ఆ ప్రభావం తరువాత జరిగే శాసనసభ ఎన్నికల్లో ఉంటుందని భావిస్తున్నారు. అదే జరిగి వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధిస్తే కబ్జా భూములను కాపాడుకోవడం సాధ్యం కాదనే బలమైన అభిప్రాయం శ్రీనాథరెడ్డిలో ఉన్నట్టు చెబుతున్నారు. దీని దృష్ట్యా పార్టీ మారే విషయంలోనూ శ్రీనాథరెడ్డి గట్టి నిర్ణయం తీసుకోలేకపోయారని అంటున్నారు. కాగా కిరణ్ సోదరుడు కిషోర్ కూడా ఇంకా ఎన్నికల ప్రచారం జోలికి వెళ్లలేదు.