తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన ఆక్రమణల తొలగింపు
నల్లకుంట(హైదరాబాద్): ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. లోకాయుక్త ఆదేశాల మేరకు బుధవారం విద్యానగర్ డివిజన్ డీడీ కాలనీలోని ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపునకు జీహెచ్ఎంసీ అధికారులు పూనుకున్నారు. ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా నుంచి వాటర్ వర్క్స్ కార్యాలయం వరకు రోడ్డుకు రెండు వైపులా ఉన్న ఆక్రమణలను తీసివేశారు. వ్యాపారులు తేరుకునే లోగానే జీహెచ్ఎంసీ సిబ్బంది దుకాణాలను పూర్తిగా నేల మట్టం చేశారు.
వారంతా వచ్చి జీఎంహెచ్సీ వ్యాన్ను అడ్డుకోవటం, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు, సిబ్బంది మెల్లగా జారుకున్నారు. దీంతో వ్యాపారులు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. విషయం తెలుసుకున్న అంబర్పేట ఇన్స్పెక్టర్ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ఆక్రమణలు తొలగిస్తున్నట్లు తమకు కనీసం సమాచారం లేదన్నారు. రోడ్డుపై బైఠాయించి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని వ్యాపారులకు సూచించారు. వారు ఆందోళన విరమించక పోవడంతో అందరినీ వాహనంలో స్టేషన్కు తరలించారు.