బుల్లెట్ ఇంకా నా శరీరంలోనే ఉంది...
నేడు పోలీసు అమరవీరుల దినం
మృతుల కుటుంబాలకు అందని సాయం
పోలీస్.. ఈ మూడక్షరాల ఈ రక్షణ వ్యవస్థే లేకుంటే.. బయటికెళ్లాలన్నా భయపడాల్సిందే.. సభలు సమావేశాలు బందే. ప్రాణం పోసినవాళ్లు దేవుళ్లయితే ఆ ప్రాణాలు కాపాడేవారు పోలీసులు. ఐశ్వర్యం ప్రసాదించేవాళ్లు దేవుళ్లు.. వాటికి కాపాలాదారులు పోలీసులు. అందుకే పోలీసులకు సెల్యూట్.
త్యాగనిరతికి, సేవకు మారుపేరైన పోలీసులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందనడంలో సందేహం లేదు. అలాంటి వారిని ప్రతీ సంవత్సరం ఓ రోజు స్మరించుకునే రోజు ఉంది. అదే అక్టోబర్ 21. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.
ఇంట్లోనే మదన్మోహన్ కాల్చివేత
మంచిర్యాల టౌన్ : మదన్మోహన్.. 1998లో తిర్యాణి ఎస్సై. ఇంటి ఆవరణలో కుటుంబ సభ్యులతో కలిసి ఏవేదో విషయాలు మాట్లాడుతున్నాడు. ఇంతలోనే ఒక్కసారిగా తూటాల వర్షం. గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తుల దాడి. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే మదన్మోహన్ కుప్పకూలిపోయాడు. ఆయనే తిర్యాణి ఎస్సై చేతి మదన్మోహన్. చంపింది అప్పటి పీపుల్స్‌వార్ న క్సలైట్లు. సరిగ్గా ఈ సంఘటన జరిగి ఇప్పటికి పదహారేళ్లు అవుతోంది. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి, మదన్మోహన్ పెద్ద కూతురు మాధవి మాటల్లో ఆనాటి ఘటన
వివరాలు..
బుల్లెట్ ఇంకా నా శరీరంలోనే ఉంది...
మా నాన్నది కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్. ముగ్గురు అన్నదమ్ముల్లో ఆయనే పెద్ద. పోలీసు శాఖలో ఉద్యోగం చేయాలని తపనతో 1977లో కానిస్టేబుల్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో పోస్టింగ్. జిల్లాలో అప్పుడు పీపుల్స్‌వార్(ఇప్పుడు మావోయిస్టు) కార్యకలాపాలు ఎక్కువగా ఉండేవి. నక్సలైట్ల చర్యలను అదుపు చేయడంలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడంతో నక్సలైట్లకు టార్గెట్‌గా మారారు. నక్సలైట్లు తన పద్ధతి మార్చుకోవాలంటూ వాల్‌పోస్టర్లు, లేఖల ద్వారా కూడా హెచ్చరించారు. అయినా విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు పోయినా పర్వాలేదనుకున్నారు.
1988లో నక్సలైట్లను నిరోధించడంలో చూపిన తెగువకు గుర్తుగా ఎస్సైగా పదోన్నతి కల్పించారు. ఎస్సైగా తిర్యాణి పోలీస్‌స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురవడంతో ఆరు నెలల పాటు సెలవు పెట్టారు. సెలవులు ముగియడంతో 1998 నవంబర్ 18న తిరిగి విధుల్లో చేరారు. అదే రోజు మంచిర్యాల ఏసీసీలోని సొంతింటికి వచ్చి అమ్మ రాధ, నాతో ఇంటి ముందు మాట్లాడుతున్నారు. చెల్లెళ్లు మనీలా, మమత ఇంట్లో ఉన్నారు. ఎప్పటి నుంచో ఆయన కదలికలపై నిఘా వేసిన నక్సలైట్లు ఐదుగురు సాయంత్రం 5 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఇంటికి వచ్చి ఒక్కసారిగా తుపాకులతో కాల్పులు జరిపారు. ఊహించని ఘటన. తేరుకునేలోపే నాన్న రక్తం మడుగులో అక్కడిక్కడే కుప్పకూలిపోయారు.
నక్సలైట్లు ద్విచక్రవాహనాలపై పారిపోయారు. ఆ కాల్పుల్లో ఓ బుల్లెట్ అమ్మకు కూడా తగిలి తీవ్ర రక్తస్రావమైంది. మరో బుల్లెట్ నాకు తాకింది. ఇప్పటికి బుల్లెట్ నా శరీరంలో అలానే ఉంది. బయటకు తీస్తే ప్రాణాలకు హాని అని వైద్యులు చెప్పారు అందుకే తీయలేదు. ఆనాడు అమ్మ, చెల్లి మమతకు ఏమీ కాలేదని సంతోషించాం. కానీ రెండేళ్ల క్రితం జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అమ్మ, చెల్లి ఇద్దరూ మృతి చెందారు. నేను అనారోగ్యంతో ఉండడంతో చెల్లెలు మనీలాకు నాన్న చనిపోయిన ఐదు రోజుల్లోనే పోలీస్‌శాఖలో ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత నాకు కోర్టులో జాబ్ వచ్చింది. ఏది ఏమైనా 1998 నవంబర్ 18 నా జీవితంలో అత్యంత భయానకమైన రోజు.
- మాధవి, మదన్మోహన్, పెద్ద కూతురు, ప్రత్యక్ష సాక్షి
మున్నాసింగ్ ప్రాణత్యాగం.. పట్టించుకోని ప్రభుత్వం
నెన్నెల : అప్పటి వరకు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆ ఇంటి పెద్ద దిక్కు మావోయిస్టుల దాడిలో కన్నుమూశాడు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుంటుంబంలో చీకటి అలుముకుంది. వారిని ఆదుకొని బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అందమైన ఆ ఉమ్మడి కుటుంబం చెల్లాచెదురైంది. ఉపాది కోసం పట్టణాలకు వలసబాట పట్టాల్సి వచ్చింది. ప్రభుత్వాలు మారుతున్న, జీవోల్లో సవరణలు చోటు చేసుకున్న వారికి మాత్రం ప్రభుత్వం సాయం అందడం లేదు.
ఇది... మావోయిస్టుల చేతిలో 2-11-1998లో మృతిచెందిన మండల కేంద్రానికి చెందిన మున్నాసింగ్ కుటుంబం దీనగాథ. నెన్నెలకు చెందిన మున్నాసింగ్(జగదీశ్వర్ సింగ్)ను మావోయిస్టులు 1998లో దారుణంగా హత్య చేశారు. ఆయన మృతితో ఆ కుంటుంబం దిక్కులేనిదైంది. మున్నాసింగ్ చిన్న కొడుకు అరుణ్‌సింగ్ తన తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉపాధి కోసం కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నాడు. ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని అధికారులను నాయకులను వేడుకున్నా ఫలితం దక్కడం లేదు. ఇతర నక్సల్స్ బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారని, తమకు మాత్రం అధికారులు ఉద్యోగం కానీ ఉపాధి కానీ చూపించలేదని మున్నాసింగ్ భార్య రాజేశ్వరీబాయి ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రభుత్వ సాయానికి సాకులు
తీవ్రవాద ఘటనల్లో మరణించిన వారి కుటుంబాలకు వర్తించేలా ప్రభుత్వం జారీ చేసిన అనేక జీవోల్లో మున్నాసింగ్ కుంటుంబాన్ని ఏ ఒక్క జీవో ఆదుకోలేకపోతోంది. జీవో ఎంఎస్ నంబరు 619/79, 612/91, 536/96, 469/96, 173/97, 76/98, 504/08, 50/14లు ప్రభుత్వం విడుదల చేసింది. తీవ్రవాద బాధిత కుటుంబాలకు చేయుత ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. దీనికి ప్రతిపాదిక అంటూ లేదు. ఒక్కోసారి పరిహారం మాత్రమే ఇస్తుండగా, కొన్ని సందర్బాల్లో ఉద్యోగాలు కూడా ఇచ్చారు.
ఉద్యోగం ఇవ్వడాన్ని క్రమబద్ధీకరించే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. 50/14 ప్రకారం 1996 సంవత్సరం కంటే ముందు తీవ్రవాద ఘటనల్లో మృతిచెందిన వారి కుటుంబానికి పరిహారంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తారు. కానీ సకాలంలో దరఖాస్తు చేసుకోలేదనే సాకుతో మున్నాసింగ్ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందడం లేదు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న తమను ఇప్పటికైనా ఆదుకోవాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.