odc
-
Sri Sathya Sai: పద్మావతి కథ విషాదాంతం
ఓడీ చెరువు (సత్యసాయి): పుట్టింటికి పంపలేదనే మనస్తాపంతో బిడ్డతో సహా బావిలోకి దూకిన వివాహిత కథ విషాదాంతమైంది. శుక్రవారమే చిన్నారి మృతదేహం లభ్యం కాగా, శనివారం తల్లి శవం బయటపడింది. వివరాలు.. అమడగూరు మండలం గొల్లపల్లికి చెందిన వెంకటేష్ భార్య పద్మావతి (26) రెండు రోజుల క్రితం తన మూడేళ్ల కుమార్తె నిహస్వి (3)తో కలిసి గ్రామ సమీపంలో ఉన్న బావిలో పడిన విషయం తెలిసిందే. నీటిపై తేలాడుతున్న చిన్నారి మృతదేహాన్ని అదే రోజు బయటకు తీశారు. పద్మావతి ఆచూకీ లభ్యం కాకపోవడంతో మండల ఎస్ఐ రమణ, ఏఎస్ఐ కిషోర్‌రెడ్డి, అటవీ శాఖ అధికారులు రాత్రంతా బావిలోని నీటిని మోటారుతో తోడించారు. శనివారం ఉదయం తల్లి శవం బయటపడింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చదవండి: (‘బంగారు తల్లి’ అంటూ మురిసిపోయావు.. అంతలోనే ఏమైంది తల్లీ?) -
‘బంగారు తల్లి’ అంటూ మురిసిపోయావు.. అంతలోనే ఏమైంది తల్లీ?
సాక్షి, ఓడీచెరువు (సత్యసాయిజిల్లా): నవమాసాలు మోసావు.. కని పెంచావు.. మూడేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నావు.. ‘బంగారు తల్లి’ అంటూ మురిసిపోయావు..అంతలోనే ఏమైంది తల్లీ? చిన్న సమస్యకే బిడ్డ భారమైపోయిందా? క్షణికావేశంతో ఆశల దీపాన్నే ఆర్పేశావు కదా! చేతులెలా వచ్చాయి తల్లీ?! పుట్టింటికి పంపలేదని మనస్తాపం చెందిన పద్మావతి(26) అనే మహిళ మూడేళ్ల బిడ్డను బావిలో పడేసింది. దీంతో ఆ బిడ్డ విగతజీవిగా మారింది. పద్మావతి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఈ ఘటన అమడగూరు మండలం గొల్లపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బుక్కపట్నం మండల కేంద్రానికి చెందిన పద్మావతి(26)కి అమడగూరు మండలం గొల్లపల్లికి చెందిన వెంకటేష్‌కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నిహస్వి (3) సంతానం. పద్మావతి, వెంకటేష్ దంపతులు అన్యోన్యంగా ఉండేవారు. రెండురోజుల కిందట పద్మావతి తనను పుట్టింటికి పంపాలని భర్తను కోరింది. అయితే పొద్దుతిరుగుడు పంట కోశాక పంపుతానని వెంకటేష్ చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె శుక్రవారం తన బిడ్డ నిహస్విని తీసుకుని ఇంటి బయటకు వెళ్లింది. భార్య, బిడ్డ కనిపించకపోవడంతో వెంకటేష్ ఇరుగూ పొరుగున ఆరా తీశాడు. తుమ్మచెట్ల బావివైపు వెళ్లినట్లు తెలిసింది. చదవండి: (మామను ప్రియుడితో హత్య చేయించిన కోడలు) బావి వద్దకు వెళ్లి చూడగా.. చిన్నారి నిహస్వి మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. చిన్నారి మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు. పద్మావతి అదే బావిలో దూకి గల్లంతయ్యిందా లేక ఎటైనా వెళ్లిందా అన్నది తెలియరాలేదు. అయితే.. బావిలోకి దూకి ఉంటుందనే ఉద్దేశంతో మోటారు సాయంతో నీటిని తోడిస్తున్నారు. రాత్రి పది గంటలైనా ఆచూకీ దొరకలేదు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ రమణ పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు అమడగూరు పోలీసులు తెలిపారు. -
‘హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు’
కదిరి టౌన్ : తమ కుమార్తెను అల్లుడే కొట్టి చంపి.. ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించాడని ఓడీచెరువు మండలం బసప్పగారిపల్లికి చెందిన సరస్వతి తల్లి లక్ష్మిదేవి ఆరోపించారు. సోమవారం సాయంత్రం కదిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఎదుట బంధువులతో కలిసి సరస్వతి మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. ఆదివారం ఉదయం సరస్వతి తనకు ఫోన్ చేసి, భర్త వేధిస్తున్నాడని వాపోయిందని తెలిపారు. ఆ తర్వాత గంట సేపటికే బావిలో శవమై తేలిందని, ఆమె శరీరంపై రక్తగాయాలు ఉన్నాయని, పరిసర ప్రాంతం అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. తమకు సమాచారం అందించకుండానే పోస్టుమార్టం పూర్తి చేయడం కూడా అనుమానాలకు తావిస్తోందన్నారు. అందుకే తాము మృతదేహాన్ని తీసుకెళుతున్న జీపును అడ్డుకుని, ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా న్యాయం చేస్తామని పోలీసులు తెలపడంతో శాంతించారు.