నిహస్వితో తల్లి పద్మావతి (ఫైల్)
సాక్షి, ఓడీచెరువు (సత్యసాయిజిల్లా): నవమాసాలు మోసావు.. కని పెంచావు.. మూడేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నావు.. ‘బంగారు తల్లి’ అంటూ మురిసిపోయావు..అంతలోనే ఏమైంది తల్లీ? చిన్న సమస్యకే బిడ్డ భారమైపోయిందా? క్షణికావేశంతో ఆశల దీపాన్నే ఆర్పేశావు కదా! చేతులెలా వచ్చాయి తల్లీ?! పుట్టింటికి పంపలేదని మనస్తాపం చెందిన పద్మావతి(26) అనే మహిళ మూడేళ్ల బిడ్డను బావిలో పడేసింది. దీంతో ఆ బిడ్డ విగతజీవిగా మారింది. పద్మావతి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఈ ఘటన అమడగూరు మండలం గొల్లపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బుక్కపట్నం మండల కేంద్రానికి చెందిన పద్మావతి(26)కి అమడగూరు మండలం గొల్లపల్లికి చెందిన వెంకటేష్‌కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నిహస్వి (3) సంతానం. పద్మావతి, వెంకటేష్ దంపతులు అన్యోన్యంగా ఉండేవారు. రెండురోజుల కిందట పద్మావతి తనను పుట్టింటికి పంపాలని భర్తను కోరింది. అయితే పొద్దుతిరుగుడు పంట కోశాక పంపుతానని వెంకటేష్ చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె శుక్రవారం తన బిడ్డ నిహస్విని తీసుకుని ఇంటి బయటకు వెళ్లింది. భార్య, బిడ్డ కనిపించకపోవడంతో వెంకటేష్ ఇరుగూ పొరుగున ఆరా తీశాడు. తుమ్మచెట్ల బావివైపు వెళ్లినట్లు తెలిసింది.
చదవండి: (మామను ప్రియుడితో హత్య చేయించిన కోడలు)
బావి వద్దకు వెళ్లి చూడగా.. చిన్నారి నిహస్వి మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. చిన్నారి మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు. పద్మావతి అదే బావిలో దూకి గల్లంతయ్యిందా లేక ఎటైనా వెళ్లిందా అన్నది తెలియరాలేదు. అయితే.. బావిలోకి దూకి ఉంటుందనే ఉద్దేశంతో మోటారు సాయంతో నీటిని తోడిస్తున్నారు. రాత్రి పది గంటలైనా ఆచూకీ దొరకలేదు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ రమణ పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు అమడగూరు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment