ఇక రెట్టింపు బస్సులు నడుపుతాం
న్యూఢిల్లీ: కాలుష్య నివారణకు ప్రతిష్టాత్మకంగా అమలుచేయనున్న సరి-బేసి నెంబర్ ప్లేట్ ఫార్ములా వల్ల ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో బస్సు సేవలను దాదాపు రెట్టింపు చేశారు. జనవరి 1 నుంచి సరి-బేసి విధానం అమలు చేస్తున్నందున అదే రోజు నుంచి ప్రస్తుతం ఉన్న బస్సు సేవలను రెట్టింపు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 6 వేల అదనపు బస్సులు ఢిల్లీ నగరంలో జనవరి 1 నుంచి రోడ్డెక్కుతాయని గురువారం రవాణాశాక మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. జనవరి 1-15 తేదీల మధ్య ఈ బస్సు సేవల్ని కొనసాగించనున్నట్లు చెప్పారు. అధిక సేవల కోసం స్కూలు బస్సులను వినియోగిస్తున్నట్లు తెలిపారు.
సీఎన్జీ స్కూలు బస్సుల్లో 50 శాతం సీట్లను మహిళలకు కేటాయించామన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం రూపకల్పణ చేసిన 'పుచో ఆప్'ను ఈ నెల 25న డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆటో సేవలను రెట్టింపు చేయనున్నట్లు, ఒకే ఆటోను రెండు డ్రైవర్లు ఒక్కో షిఫ్ట్ చొప్పున నడుపుతారని మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. లోకల్ ట్రైన్ సర్వీసులు పొడిగించే దిశగా చర్చలు సాగిస్తున్నట్లు వివరించారు. సోమ, బుధ, శుక్రవారాల్లో బేసి సంఖ్య నెంబర్ ప్లేటు ఉన్న వాహనాలను రోడ్డుమీదకు అనుమతిస్తామని, మంగళ , గురు, శనివారాల్లో సరి సంఖ్య నెంబర్ ప్లేటు ఉన్న వాహనాలకు వీలు కల్పిస్తామని అధికారులు ఇటీవలే మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం విదితమే.