విప్ ఓదేలు వాహనానికి ప్రమాదం
గేదెలను తప్పించబోయి ఢీకొన్న కాన్వాయ్... త్రుటిలో తప్పిన ముప్పు
అడ్డాకుల: ప్రభుత్వ విప్, ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు వాహనం మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూర్ స్టేజీ వద్ద స్వల్ప ప్రమాదానికి గురైంది. ఓదేలుకు చెందిన మూడు వాహనాలు ఒకదాని వెనుక మరొకటి ఢీకొట్టుకోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పిపోయింది. విప్ ఓదేలుతో సహా మూడు వాహనాల్లో ఉన్న వారెవరూ గాయపడలేదు. కర్నూలు జిల్లాలో గురువారం ఓ వివాహానికి హాజరైన ఓదేలు తిరిగి హైదరాబాద్కు బయలుదేరారు. మార్గమధ్యంలో మహబూబ్నగర్ జిల్లా కందూర్ స్టేజీ వద్ద రోడ్డుపైకి సడన్గా గేదెలు రావడంతో ముందు వెళ్తున్న ఓదేలు ఫార్చునర్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుక ఉన్న వాహనాలు ఢీకొన్నాయి. అడ్డాకుల ఎస్ఐ కె.శ్రీనివాస్ వాహనాలను రోడ్డు పక్కకు తీయించారు. మరో వాహనంలో విప్ ఓదేలు హైదరాబాద్కు బయలుదేరారు.