ఎల్అండ్టీ లాభం 7% ప్లస్
ముంబై: ఇంజనీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. నికర లాభం దాదాపు 7% పెరిగి రూ. 862 కోట్లకు చేరింది. గతేడాది(2013-14) క్యూ2లో రూ. 806 కోట్లు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. విద్యుత్, హైడ్రోకార్బన్ల విభాగం అమ్మకాలు మందగించడం లాభాలపై ప్రభావాన్ని చూపింది.
ఇదే కాలానికి కంపెనీ మొత్తం ఆదాయం సుమారు 11% పుంజుకుని రూ. 21,159 కోట్లను అధిగమించింది. గతంలో రూ. 19,130 కోట్ల ఆదాయం నమోదైంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా అమ్మకాలు మందగించాయని, అయితే వాతావరణం మెరుగుపడుతున్నదని కంపెనీ సీఎఫ్‌వో ఆర్.శంకర్ రామన్ చెప్పారు. ప్రభుత్వం తీసుకువచ్చిన వృద్ధి ఆధారిత సంస్కరణల ప్రభావం కనిపించడానికి మరికొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. కొత్తగా రూ. 39,797 కోట్ల ఆర్డర్లు సంపాదించింది. ఇది 17% అధికం. దీంతో మొత్తం ఆర్డర్‌బుక్ విలువ రూ. 2,14,429 కోట్లను తాకింది. దీనిలో అంతర్జాతీయ మార్కెట్ల వాటా 27%.
ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌ల అండ
ప్రధానంగా మౌలిక సదుపాయాలు(ఇన్ఫ్రాస్ట్రక్చర్), అభివృద్ధి ప్రాజెక్ట్‌లు సాధించిన పురోగతి ఆదాయాల్లో వృద్ధికి దోహదపడినట్లు రామన్ పేర్కొన్నారు. ఇన్ఫ్రా విభాగం ఆదాయం 27% ఎగసి రూ. 9,633 కోట్లను తాకిందని, ఇందుకు భారీస్థాయిలో లభించిన ఆర్డర్‌బుక్ సహకరించిందని తెలిపారు. దీనిలో అంతర్జాతీయ వాటా 27%గా వెల్లడించారు. పలు బిజినెస్ విభాగాల్లో ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
అయితే విద్యుత్, మెటల్స్, హైడ్రోకార్బన్లు విభాగాలు నెమ్మదించాయని తెలిపారు. డెవలప్మెంటల్ ప్రాజెక్ట్‌ల ఆదాయం రూ. 993 కోట్లుగా నమోదుకాగా, విద్యుత్ విభాగం అమ్మకాలు 20% తగ్గి రూ. 1,153 కోట్లకు పరిమితమయ్యాయి. కొత్తగా పొందిన ప్రాజెక్ట్‌లు అభివృద్ధి దశలో ఉండటమే దీనికి కారణమని రామన్ తెలిపారు. కాగా, హైడ్రోకార్బన్ల బిజినెస్ నుంచి 24% తక్కువగా రూ. 1,804 కోట్ల ఆదాయం లభించినట్లు కంపెనీ వెల్లడించింది.