Odisha Chief Minister Naveen Patnaik
-
లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ
న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిజు జనతా దళ్ (బీజేడీ) ఒంటరి పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. గురువారం ప్రధాని మోదీని కలిసి మంతనాలు జరిపారు. బీజేపీకి, కాంగ్రెస్‌కి సమానదూరం పాటిస్తానని తర్వాత మీడియాతో పట్నాయక్ చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం కోసం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తాను చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నవీన్ పట్నాయక్‌ను కలుసుకున్న మర్నాడే ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతామని తేల్చి చెప్పడం విశేషం. నితీశ్ భువనేశ్వర్‌కు వచ్చి తనను మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని పట్నాయక్ చెప్పారు. 2000 సంవత్సరం నుంచి ఒడిశాలో అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ అప్పట్నుంచి బీజేపీ, కాంగ్రెస్ మధ్య వచ్చే వివాదాస్పద అంశాల్లో తటస్థ వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు. -
Tokyo Olympics 2021: స్వర్ణం గెలవండి.. ఆరు కోట్లు పొందండి
భువనేశ్వర్: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021లో పాల్గొనే ఒడిశా అథ్లెట్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రోత్సహకాలు ప్రకటించారు. జపాన్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ 2021లో పతకాలు సాధించిన క్రీడాకారులకు భారీ నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు తెలిపారు. బంగారు పతకం సాధించిన వారికి రూ. 6 కోట్లు, రజతం సాధిస్తే రూ. 4 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ . 2.5 కోట్లు చొప్పున బహుమతిగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ నెల 23 నుంచి జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న క్రీడాకారులందరికీ రూ.15లక్షలు చొప్పున నగదు ఇస్తామని సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. విశ్వక్రీడలకు సన్నద్ధమయ్యేందుకు ఈ నగదు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఒలింపిక్స్‌కు ఎంపికైన క్రీడాకారులతో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌కు వెళ్లాలనేది ప్రతి క్రీడాకారుడి కల అని, పతకం గెలవడం ద్వారా ఆ కల సాకారమవుతుందని అన్నారు. తమ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్‌కు వెళ్తున్న ద్యుతి చంద్, ప్రమోద్ భగత్, దీప్ గ్రేస్ ఎక్కా, నమిత టొప్పో, వీరేంద్ర లక్రా, అమిత్ రోహిదాస్‌లకు సీఎం అభినందనలు తెలిపారు. ఇక టోక్యో ఒలింపిక్స్ కోసం ఈ నెల 17న భారత తొలి బృందం బయల్దేరనుంది. 14నే ఈ బృందాన్ని పంపాలని భారత ఒలింపిక్ సంఘం భావించినప్పటికీ.. ఒలింపిక్స్ నిర్వాహకుల నుంచి అనుమతి లభించలేదు. దీంతో 17వ తేదీన భారత బృందం టోక్యోకు వెళ్లనుంది. ఒలింపిక్స్ గ్రామానికి చేరుకున్నాక మూడు రోజులు క్రీడాకారులందరూ క్వారంటైన్లో ఉండాలి. మిగతా క్రీడాకారులు మరో రెండు రోజుల తర్వాత టోక్యోకు వెళ్తారు. మరోవైపు ప్రస్తుతం క్రొయేషియాలో ఉన్న భారత షూటింగ్ జట్టు 16న టోక్యోకు బయల్దేరనుంది. మొత్తంగా భారత్ నుంచి 120కి పైగా అథ్లెట్లు విశ్వక్రీడలకు వెళ్లనున్నారు. -
ఒడిశాలో ‘రైతుబంధు’
భువనేశ్వర్: రైతులకు అండగా నిలిచేందుకు ఒడిశా ప్రభుత్వం ఓ భారీ పథకాన్ని ప్రారంభించింది. రైతులకు పెట్టుబడి వ్యయం, భూముల్లేని వారికి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రోత్సాహం, వృద్ధాప్యం, అంగవైకల్యం తదితర కారణాలతో వ్యవసాయం చేయలేని స్థితిలో ఉన్న రైతులకు ఆర్థిక సహాయం తదితరాలు ఈ పథకంలో ఉన్నాయి. కలియా (కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్‌కం ఆగ్మెంటేషన్) పేరుతో కొత్త పథకాన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శుక్రవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రకటించారు. ఈ పథకం కింద 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. 10,180 కోట్లను ఒడిశా ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న రుణమాఫీ హామీలు అర్థరహితమని నవీన్ పట్నాయక్ అన్నారు. రుణమాఫీ కన్నా తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకంతోనే రైతులకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందనీ, అధిక శాతం మందికి ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన తెలిపారు. ఒడిశాలో దాదాపు 32 లక్షల మంది రైతులుంటే కేవలం 20 లక్షల మందే పంటరుణాలను తీసుకున్నారనీ, రుణమాఫీ ప్రకటిస్తే మిగిలిన 12 లక్షల మందికి ప్రయోజనం ఉండదనీ, తమ కలియా పథకం మాత్రం 30 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తుందని పట్నాయక్ వివరించారు. ఇవీ పథకం ప్రయోజనాలు ► భూ విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా వ్యవసాయం చేసే ప్రతీ కుటుంబానికి ఒక్కో సీజన్లో (ఖరీఫ్, రబీ) పెట్టుబడి కోసం రూ. 5,000 ఆర్థిక సాయం. కౌలు రైతులు కూడా ఈ మొత్తం పొందడానికి అర్హులే. ► గొర్రెలు, కోళ్లు, బాతులు, తేనెటీగల పెంపకం దార్లకు, చేపలు పట్టే వారికి అవసరమైన సామగ్రిని సమకూర్చుకునేందుకు రూ. 12,500 ఆర్థిక సాయం. భూమి లేని వారే ఇందుకు అర్హులు. వీటిలో ఏదో ఒక దాన్నే ఎంచుకోవాలి. ► వృద్ధాప్యం, అంగవైకల్యం, రోగాలు తదితర కారణాల వల్ల వ్యవసాయం చేయలేకపోతున్న రైతులకు ఒక్కో ఇంటికి ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం. లబ్ధిదారులను గ్రామ పంచాయతీలు ఎంపిక చేస్తాయి. ► భూమి ఉన్న, లేని రైతులనే భేదం లేకుండా అందరికీ రూ. 2 లక్షల జీవిత బీమా, మరో రూ. 2 లక్షల ప్రమాద బీమా ► 50 వేల వరకు రుణాలపై వడ్డీ ఉండదు. జార్ఖండ్‌లోనూ కొత్త పథకం ఒడిశా తరహాలోనే జార్ఖండ్‌లోనూ ఓ పథకాన్ని రైతుల కోసం సీఎం రఘుబర్‌దాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం కింద రూ. 2,250 కోట్లను ఖర్చు చేయనుండగా, 22.76 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు లబ్ధి పొందనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు ప్రభుత్వం ఏడాదికి రూ. 5,000 ఆర్థిక సాయం అందజేయనుంది. గరిష్టంగా ఐదెకరాల వరకు భూమి ఉన్న రైతులు ఈ సాయం పొందేందుకు అర్హులు. రైతులు విత్తనాలు, ఎరువులు, తదితరాలను సమకూర్చుకునేందుకు ఈ పథకం సాయపడుతుంది. -
ఒడిశా సీఎం హెలికాప్టర్ అదృశ్యం
45 నిమిషాల పాటు ఉత్కంఠ... సమాచార లోపంతో గందరగోళం భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దాదాపు ముప్పావు గంట (45 నిమిషాలు) ఆచూకీ తెలియకుండా పోయింది. ఆ తర్వాత హెలికాప్టర్ సభా ప్రాంగణానికి చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గురువారం కొరాపుట్ జిల్లా జయపురంలో పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి ముందస్తు షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 12.35 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి కోట్పాడు బయల్దేరారు. 12.50 గంటలకు కోట్పాడుకు చేరాల్సి ఉంది. అనుకున్న సమయానికి హెలికాప్టర్ అక్కడికి చేరుకోలేదు. దీంతో అంతా అందోళనకు గురయ్యారు. ప్రధానంగా ముఖ్యమంత్రి భద్రత, జిల్లా యంత్రాంగం అధికారుల్ని పరుగులు తీయించింది. హెలికాప్టర్ కదలికకు సంబంధించి ఎటువంటి సమాచారం లభించలేదు. ఎట్టకేలకు మధ్యాహ్నం 1.35 గంటల ప్రాంతంలో సీఎం హెలికాప్టర్ కోట్పాడు సభా ప్రాంగణానికి చేరింది. తప్పుడు సమాచారంతో ఈ మేరకు అసౌకర్యం చోటుచేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం. ఈ సంఘటనలో వర్క్స్ విభాగం కార్యనిర్వాహక ఇంజనీరు బిరాంచి మహంతిని సస్పెండ్ చేసినట్టు గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తదుపరి విచారణకు కొరాపుట్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. -
ఆత్మకథ రాయబోనన్న ముఖ్యమంత్రి
రాజకీయాల్లోకి రాకముందే రచయితగా ఖ్యాతిగడించారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. తండ్రి బిజూ పట్నాయక్ మరణంతో అనూహ్యంగా రాజకీయరంగప్రవేశం చేసిన ఆయన.. 1997 నుంచి ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. ఆ ట్రాక్ రికార్డును గుర్తుచేస్తూ 'ఎన్నికల్లో గెలవటం ఎలా?' అనే టైటిల్ తో నవీన్ పట్నాయక్ ఆత్మకథరాస్తే బాగుంటందని శనివారం ప్రారంభమైన భువనేశ్వర్ లిటరరీ ఫెస్టివల్ లో కొందరు రచయితలు సలహాఇచ్చారు. దీనికి స్పందిస్తూ 'నా నిజజీవితకథ అంత ఆసక్తికరంగా ఉండదు. అందుకే ఆత్మకథ రాసే ఉద్దేశం లేదు' అని నవీన్ పట్నాయక్ బదులిచ్చారు. పని ఒత్తిడి వల్ల పెన్ను పట్టలేకపోతున్నానని, మళ్లీ రాస్తే కాల్పనిక గాథలేగానీ స్వీయగాథ రాయబోనని తేల్చిచెప్పారు. స్థానిక భాషా రచనలకు ఆదరణ కొరవడిందన్న సీఎం.. ఆయా పుస్తకాలను మూలం చెడిపోకుండా ప్రధానశ్రేణి భాషల్లోకి అనువదించడం ద్వారా కాపాడుకోవచ్చన్నారు. వనమూలికా వైద్యంపై 'ది గార్డెన్ ఆఫ్ లైఫ్', రాజస్థాన్ ఎడారిలోని బికనీర్ పై 'డెసర్ట్ కింగ్ డమ్', 1590-1947 మధ్య భారతదేశ చరిత్రను వివరిస్తూ 'ఎ సెకండ్ పారడైజ్' నవీన్ పట్నాయక్ రాసిన పుస్తకాల్లో బెస్ట్ సెల్లర్స్.