ఒడిశా సీఎం హెలికాప్టర్ అదృశ్యం
45 నిమిషాల పాటు ఉత్కంఠ... సమాచార లోపంతో గందరగోళం
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దాదాపు ముప్పావు గంట (45 నిమిషాలు) ఆచూకీ తెలియకుండా పోయింది. ఆ తర్వాత హెలికాప్టర్ సభా ప్రాంగణానికి చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గురువారం కొరాపుట్ జిల్లా జయపురంలో పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి ముందస్తు షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 12.35 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి కోట్‌పాడు బయల్దేరారు. 12.50 గంటలకు కోట్‌పాడుకు చేరాల్సి ఉంది. అనుకున్న సమయానికి హెలికాప్టర్ అక్కడికి చేరుకోలేదు.
దీంతో అంతా అందోళనకు గురయ్యారు. ప్రధానంగా ముఖ్యమంత్రి భద్రత, జిల్లా యంత్రాంగం అధికారుల్ని పరుగులు తీయించింది. హెలికాప్టర్ కదలికకు సంబంధించి ఎటువంటి సమాచారం లభించలేదు. ఎట్టకేలకు మధ్యాహ్నం 1.35 గంటల ప్రాంతంలో సీఎం హెలికాప్టర్ కోట్‌పాడు సభా ప్రాంగణానికి చేరింది. తప్పుడు సమాచారంతో ఈ మేరకు అసౌకర్యం చోటుచేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం. ఈ సంఘటనలో వర్క్స్ విభాగం కార్యనిర్వాహక ఇంజనీరు బిరాంచి మహంతిని సస్పెండ్ చేసినట్టు గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తదుపరి విచారణకు కొరాపుట్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.