ఆత్మకథ రాయబోనన్న ముఖ్యమంత్రి
రాజకీయాల్లోకి రాకముందే రచయితగా ఖ్యాతిగడించారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. తండ్రి బిజూ పట్నాయక్ మరణంతో అనూహ్యంగా రాజకీయరంగప్రవేశం చేసిన ఆయన.. 1997 నుంచి ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. ఆ ట్రాక్ రికార్డును గుర్తుచేస్తూ 'ఎన్నికల్లో గెలవటం ఎలా?' అనే టైటిల్ తో నవీన్ పట్నాయక్ ఆత్మకథరాస్తే బాగుంటందని శనివారం ప్రారంభమైన భువనేశ్వర్ లిటరరీ ఫెస్టివల్ లో కొందరు రచయితలు సలహాఇచ్చారు.
దీనికి స్పందిస్తూ 'నా నిజజీవితకథ అంత ఆసక్తికరంగా ఉండదు. అందుకే ఆత్మకథ రాసే ఉద్దేశం లేదు' అని నవీన్ పట్నాయక్ బదులిచ్చారు. పని ఒత్తిడి వల్ల పెన్ను పట్టలేకపోతున్నానని, మళ్లీ రాస్తే కాల్పనిక గాథలేగానీ స్వీయగాథ రాయబోనని తేల్చిచెప్పారు. స్థానిక భాషా రచనలకు ఆదరణ కొరవడిందన్న సీఎం.. ఆయా పుస్తకాలను మూలం చెడిపోకుండా ప్రధానశ్రేణి భాషల్లోకి అనువదించడం ద్వారా కాపాడుకోవచ్చన్నారు. వనమూలికా వైద్యంపై 'ది గార్డెన్ ఆఫ్ లైఫ్', రాజస్థాన్ ఎడారిలోని బికనీర్ పై 'డెసర్ట్ కింగ్ డమ్', 1590-1947 మధ్య భారతదేశ చరిత్రను వివరిస్తూ 'ఎ సెకండ్ పారడైజ్' నవీన్ పట్నాయక్ రాసిన పుస్తకాల్లో బెస్ట్ సెల్లర్స్.