Odisha Elections 2019
-
ఈ సుబుద్ధి.. ఒక్కసారీ గెలవలేదు
గజనీ మహ్మద్ భారతదేశంపై 17 సార్లు దండెత్తి విఫలుడయ్యాడని చారిత్రక కథనం. ఒడిశాకు చెందిన ఈ ఎన్నికల గజనీ ఏకంగా 32 సార్లు ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా ముప్పయి మూడోసారి మళ్లీ బరిలో దిగారు. అదీ రెండుచోట్ల. ఒడిశాలోని బెర్హంపూర్‌కు చెందిన హోమియోపతి వైద్యుడు శ్యామ్‌బాబు సుబుద్ధి ఈ లోక్‌సభ ఎన్నికల్లో అస్కా, బెర్హంపూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇండిపెండెంటుగా పోటీ చేస్తున్నారు.1962 నుంచి ఇంత వరకు ఆయన లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 32 సార్లు పోటీచేసి ‘విజయవంతంగా పరాజయం’ పాలయ్యారు. అయినా వెరవకుండా ఇప్పుడు మరోసారి పోటీకి సై అంటున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనే కాకుండా జూన్ 11న రాష్ట్రం నుంచి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని 84 ఏళ్ల సుబుద్ధి చెప్పారు. గతంలో సుబుద్ధి పీవీ నరసింహారావు, బిజు పట్నాయక్ వంటి ఉద్దండులతో పోటీ పడ్డారు. ఈసారి తనకు ఎన్నో పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదని ఆయన అంటున్నారు. ఎన్నికల ఖర్చంతా ఆయనే సొంతంగా పెట్టుకుంటారట. రైళ్లు, బస్సుల్లో, మార్కెట్లలో ఆయన విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ‘గెలుపోటములను నేను పట్టించుకోను. అవినీతికి వ్యతిరేకంగా నేను పోరాడుతూనే ఉంటాను. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తా’ అని స్పష్టం చేశారు శ్యామ్. -
కటాఫ్ ఏరియాలో ఎన్నికల సందడి
విముక్తి ప్రాంతంగా మావోయిస్టులు పిలుచుకునే ఆంధ్రా ఒరిస్సా బోర్డర్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతం మల్కాన్‌గిరిలో చాలాకాలం తరువాత ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుహక్కుని వినియోగించుకునే పరిస్థితులు నెలకొల్పినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఆం్రధ్రా ఒరిస్సా బోర్డర్ (ఏఓబీ)లోని ఈ కటాఫ్ ఏరియాపై మావోయిస్టులకు పట్టుంది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా దశాబ్దం క్రితం బలిమెల రిజర్వాయర్‌లో యాంటీ నక్సల్స్ స్క్వాడ్‌ని తీసుకెళుతోన్న పడవపై మావోయిస్టులు జరిపిన దాడిలో 38 మంది పోలీసు సిబ్బంది మరణించారు. ఆ తరువాత కూడా ఆ ప్రాంతమంతా మావోయిస్టుల అధీనంలోనే ఉంది. మొన్నటి వరకూ ఈ ప్రాంతానికీ బాహ్య ప్రపంచానికీ సంబంధంలేని పరిస్థితులుండేవి. పాలనా వ్యవస్థ సైతం అక్కడ శూన్యమనే చెప్పాలి. ఎట్టకేలకు ఒడిశా ప్రభుత్వం బాహ్య ప్రపంచానికీ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతానికీ మధ్య గురుప్రియ నదిపై నిర్మించిన బ్రిడ్జిని 2018, జూలై 26న ప్రారంభించడంతో ఈ ప్రాంతానికి రాకపోకలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ ఎన్నికల్లో నేతలకు ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టే అవకాశం లభించింది. తొలిసారి ఈ ప్రాంతంలో రాజకీయ నాయకుల ప్రచారం ప్రారంభమైంది. స్థానిక ప్రజలు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేశామని మల్కాన్‌గిరి ఎస్పీ జగ్మోహన్ మీనా వెల్లడించారు. -
ఒడిశాలో రాజకీయ హత్య..!
కియోంఝర్ : మొదటి దశ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న వేళ ఒడిశాలో మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర బహెరా దారుణ హత్యకు కలకలం రేపింది. 2014 ఎన్నికల్లో ఘాజీపుర నుంచి బహెరా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తాజా ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేడీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతుండగా.. కొందరు దుండగులు ఆయనను దారుణంగా హతమార్చారు. సోమవారం రాత్రి ధకోట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో బహెరా ఇంటికి చేరుకున్న 10 మంది దుండగులు.. ఆయనను బయటికి పిలిచి మారణాయుధాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బహెరాను ఆనందపూర్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కాగా, ఈ హత్య కేసులో నలుగురు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. సంజీవ్ పృష్టి, అజిత్ పృష్టి, దోలో గోవింద బొతాయ్, ప్రమోద్ దాస్‌ను విచారిస్తున్నారు. ఇదిలాఉండగా.. బీజేడీలో బహెరా చేరికతో రాజకీయంగా ఇబ్బందులు తలెత్తుతాయన్న కారణంగా స్థానిక (ఘాజీపుర) ఎమ్మెల్యే, విద్యాశాఖమంత్రి బద్రీనారాయణ్ దళ్ ఈ హత్య చేయించారని బీజేపీ నేత పృథ్విరాజ్ కౌనర్ ఆరోపించారు. బద్రీనారాయణ తనయులే ఈ హత్యకేసులో కీలక సూత్రదారులని అనుమానం వ్యక్తం చేశారు. ‘మాపై బీజేపీ కావాలనే హత్యారోపణలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఒడిశాలో ఓటమి తప్పదనే బీజేడీ ప్రతిష్టను దిగజార్చాలని కుట్రలు చేస్తోంది’ అని బద్రీ విమర్శించారు. బెహెరా హత్యకేసును సీబీఐకి అప్పగిస్తూ సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలు జారీ చేశారు. -
పోటీ ‘బొమ్మ’లాట కాదు.. నిజమే!
ఈ ఫోటోలో కనిపిస్తున్నది ముక్తికాంత బిస్వాల్. ఒడిశాకు చెందిన 31 ఏళ్ల ఈ యువకుడి వృత్తి బొమ్మలు చేసి అమ్మడం. ఒడిశా శాసనసభ ఎన్నికల్లో రూర్కెలా నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఇతనికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇతనికున్న అర్హతల్లా మోదీని చూసేందుకు కాలినడకన ఢిల్లీ వెళ్లడం! అవును. నిజమే.. అసలు విషయం ఏమిటంటే.. రూర్కెలాలోని జనరల్ ఆస్పత్రి స్థాయి పెంచుతానని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారట. దాని సంగతి కనుక్కోవడానికి, పనిలో పనిగా మోదీని కలుసుకోవచ్చని బిస్వాల్ గత ఏడాది ఢిల్లీ యాత్ర పెట్టుకున్నాడు. రూర్కెలా నుంచి 71 రోజుల పాటు 1500 కిలోమీటర్లకుపైగా నడిచి ఢిల్లీ చేరుకున్నాడు. అయితే, మోదీ దర్శనం మాత్రం కాలేదట. దార్లో కళ్లుతిరిగి పడిపోతే ఆగ్రాలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స కూడా పొందాడు. ఆ నడకే ఇప్పుడు బిస్వాల్‌కు కాంగ్రెస్ టికెట్ ఇప్పించింది. -
ఒడిశాలో 4 దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు
భువనేశ్వర్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. మహిళాసాధికారతకు ఇది తొలిమెట్టు అని పేర్కొన్నారు. ఆదివారం కేంద్రపాడాలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన ఈ ప్రకటన చేశారు. దీంతో 21 లోక్‌సభ స్థానాలున్న ఒడిశాలో ఏడుగురు మహిళలకు అవకాశం లభించనుంది. ప్రస్తుతం ఒడిశా నుంచి ముగ్గురు మహిళలే లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 147 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీలో 12 మంది మహిళలు ఉన్నారు. అయితే, పట్నాయక్ ప్రకటనను మహిళల ఓట్లు కొల్లగొట్టేందుకు వేసిన ఎత్తు గడగా కాంగ్రెస్, బీజేపీ కొట్టిపారేశాయి. సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించే ప్రతిపాదనపై తమ పార్టీకి అభ్యంతరం లేదని, ప్రజల విశ్వసనీయత కోల్పోయిన నేపథ్యంలో బీజేడీ దీనిని చివరి అవకాశంగా ఉపయోగించుకుంటోందని విమర్శించారు.