కియోంఝర్ : మొదటి దశ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న వేళ ఒడిశాలో మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర బహెరా దారుణ హత్యకు కలకలం రేపింది. 2014 ఎన్నికల్లో ఘాజీపుర నుంచి బహెరా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తాజా ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేడీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతుండగా.. కొందరు దుండగులు ఆయనను దారుణంగా హతమార్చారు. సోమవారం రాత్రి ధకోట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో బహెరా ఇంటికి చేరుకున్న 10 మంది దుండగులు.. ఆయనను బయటికి పిలిచి మారణాయుధాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బహెరాను ఆనందపూర్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
కాగా, ఈ హత్య కేసులో నలుగురు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. సంజీవ్ పృష్టి, అజిత్ పృష్టి, దోలో గోవింద బొతాయ్, ప్రమోద్ దాస్‌ను విచారిస్తున్నారు. ఇదిలాఉండగా.. బీజేడీలో బహెరా చేరికతో రాజకీయంగా ఇబ్బందులు తలెత్తుతాయన్న కారణంగా స్థానిక (ఘాజీపుర) ఎమ్మెల్యే, విద్యాశాఖమంత్రి బద్రీనారాయణ్ దళ్ ఈ హత్య చేయించారని బీజేపీ నేత పృథ్విరాజ్ కౌనర్ ఆరోపించారు. బద్రీనారాయణ తనయులే ఈ హత్యకేసులో కీలక సూత్రదారులని అనుమానం వ్యక్తం చేశారు. ‘మాపై బీజేపీ కావాలనే హత్యారోపణలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఒడిశాలో ఓటమి తప్పదనే బీజేడీ ప్రతిష్టను దిగజార్చాలని కుట్రలు చేస్తోంది’ అని బద్రీ విమర్శించారు. బెహెరా హత్యకేసును సీబీఐకి అప్పగిస్తూ సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment