కటాఫ్‌ ఏరియాలో ఎన్నికల సందడి | AOB Malkangiri People Vote Right | Sakshi
Sakshi News home page

కటాఫ్‌ ఏరియాలో ఎన్నికల సందడి

Mar 28 2019 11:13 AM | Updated on Mar 28 2019 5:07 PM

AOB Malkangiri People Vote Right - Sakshi

విముక్తి ప్రాంతంగా మావోయిస్టులు పిలుచుకునే ఆంధ్రా ఒరిస్సా బోర్డర్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతం మల్కాన్‌గిరిలో చాలాకాలం తరువాత ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుహక్కుని వినియోగించుకునే పరిస్థితులు నెలకొల్పినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఆం్రధ్రా ఒరిస్సా బోర్డర్‌ (ఏఓబీ)లోని ఈ కటాఫ్‌ ఏరియాపై మావోయిస్టులకు పట్టుంది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా దశాబ్దం క్రితం బలిమెల రిజర్వాయర్‌లో యాంటీ నక్సల్స్‌ స్క్వాడ్‌ని తీసుకెళుతోన్న పడవపై మావోయిస్టులు జరిపిన దాడిలో 38 మంది పోలీసు సిబ్బంది మరణించారు.

ఆ తరువాత కూడా ఆ ప్రాంతమంతా మావోయిస్టుల అధీనంలోనే ఉంది. మొన్నటి వరకూ ఈ ప్రాంతానికీ బాహ్య ప్రపంచానికీ సంబంధంలేని పరిస్థితులుండేవి. పాలనా వ్యవస్థ సైతం అక్కడ శూన్యమనే చెప్పాలి. ఎట్టకేలకు ఒడిశా ప్రభుత్వం బాహ్య ప్రపంచానికీ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతానికీ మధ్య గురుప్రియ నదిపై నిర్మించిన బ్రిడ్జిని 2018, జూలై 26న ప్రారంభించడంతో ఈ ప్రాంతానికి రాకపోకలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ ఎన్నికల్లో నేతలకు ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టే అవకాశం లభించింది. తొలిసారి ఈ ప్రాంతంలో రాజకీయ నాయకుల ప్రచారం ప్రారంభమైంది. స్థానిక ప్రజలు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేశామని మల్కాన్‌గిరి ఎస్‌పీ జగ్‌మోహన్‌ మీనా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement