ఆప్ ఎంపీని ఆదుకున్న మోదీ
- ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిచ్చి అలసిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవత్ మన్
- మంచినీళ్లు అందించి దాహార్తి తీర్చిన ప్రధానమంత్రి
న్యూఢిల్లీ: శత్రువైనాసరే కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోమని చెప్పే కర్మభూమి మనది. అందుకేనేమో నరేంద్ర మోదీ.. పదవీమర్యాదలు పక్కనపెట్టిమరీ దాహంతో అల్లాడుతున్న విపక్ష ఎంపీకి మంచినీళ్లు అందించి సభ చేత శెభాష్ అనిపించుకున్నారు. బుధవారం లోక్సభ ప్రారంభమైన అరగంటకు చోటుచేసుకున్న ఈ సంఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. సభలో అసలేం జరిగిందంటే..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆఫీసుపై సీబీఐ దాడులపై చర్చించాల్సిందిగా ఆప్ ఎంపీ భగవత్ మన్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. స్పీకర్ తీరును నిరసిస్తూ భగవత్ పోడియం వద్దకు వెళ్లి పెద్ద పెట్టున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీలు కూడా ఆయనకు బాసటగా నిలిచారు. దీంతో వెల్ మొత్తం విపక్ష ఎంపీలతో నిడిపోయింది.
సరిగ్గా ప్రధాని కూర్చున్న స్థానానికి ముందే నిలబడి నిరసన తెలుపుతున్న భగవత్.. అలసటతో మంచినీటి కోసం అటూ ఇటూ వెదికారు. ఆయన దాహార్తిని అర్థం చేసుకున్న మోదీ.. తన టేబుల్ మీదున్న గ్లాసును భగవత్ కు అందించారు. ఆప్ ఎంపీ ఒక్క గుక్కలో గ్లాసును ఖాళీచేసి తిరిగి టేబుల్ మీద ఉంచగా, మోదీ ఆ గ్లాసుపై మూత పెట్టేశారు.
అంతే, ప్రధాన మంత్రి చర్యను ప్రశంసిస్తూ బీజేపీ సభ్యులు బల్లలు చరిచారు. దాహం తీరిన భగవత్ ఆందోళన కొనసాగించారు. నిరసన తెలుపుతున్న ఎంపీలు అడ్డుండటంతో ప్రధాని టేబుల్ వద్ద చోటుచేసుకున్న ఈ సంఘటనను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చూడలేకపోయారు. ఆ తర్వాత విషయం తెలుసుకుని నవ్వుకున్నారు.