జేడీఎస్ ఆఫీస్ కాంగ్రెస్‌దే
= హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు
= 30 ఏళ్ల వివాదానికి తెర
= ‘సుప్రీం’ను ఆశ్రయించే యోచనలో జేడీఎస్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సుదీర్ఘ న్యాయ పోరాటంలో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడి రేస్ కోర్సు రోడ్డులోని జేడీఎస్ కార్యాలయం ఆ పార్టీకి చెందుతుందని హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పునిచ్చింది. దరిమిలా 30 ఏళ్ల వివాదానికి తెర పడింది. కోర్టు ఖర్చులను చెల్లించాలని, మూడు నెలల్లోగా కార్యాలయాలన్ని ఖాళీ చేసి కాంగ్రెస్‌కు అప్పగించాలని న్యాయమూర్తులు సూరి అప్పారావు, కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది.
ఈ భవన వివాదానికి సంబంధించి 2005లో స్థానిక సివిల్ కోర్టు కాంగ్రెస్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిని సవాలు చేస్తూ జేడీఎస్ హైకోర్టును ఆశ్రయించినా.. అక్కడా చుక్కెదురైంది. కాగా హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. జేడీఎస్ సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది.
నేపథ్యం
1954లో అప్పటి కాంగ్రెస్ నాయకులు సుబ్బన్న, రంగస్వామిలు ఈ స్థలాన్ని పార్టీకి దానంగా ఇచ్చారు. 1957లో అక్కడ పెద్ద భవంతిని నిర్మించారు. 1969లో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. తదనంతరం కాంగ్రెస్ (ఐ), కాంగ్రెస్ (ఓ)లుగా ఆవిర్భవించాయి. వీటిలో నిజమైన కాంగ్రెస్ ఏదనే వివాదం నెలకొంది. న్యాయ పోరాటం కూడా మొదలైంది. కాంగ్రెస్ (ఐ) నిజమైన కాంగ్రెస్ అని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది.
అప్పటికే భవనం కాంగ్రెస్ (ఓ) స్వాధీనంలో ఉండేది. తర్వాతి పరిణామాల్లో ఈ పార్టీ జనతా పార్టీలో విలీనమైంది. దరిమిలా కార్యాలయం కూడా ఆ పార్టీ పరమైంది. తదనంతరం జనతా పార్టీ, జనతా దళ్‌గా మారింది. ఈ పార్టీ కూడా రాష్ట్రంలో రెండుగా చీలిపోగా, జేడీఎస్, జేడీయూలు ఆవిర్భవించాయి. కార్యాలయం జేడీఎస్ ఆధీనంలోకి వెళ్లింది. ఈ భవనంలోనే పార్టీ ప్రధాన కార్యాలయం ఉంది.