‘విత్తన నాణ్యతలో రాజీ పడొద్దు’
తనకల్లు : ఖరీఫ్‌లో రైతులకు సబ్సిడీతో పంపిణీ చేసే విత్తన వేరుశనగ నాణ్యతలో రాజీ పడొద్దని వ్యవసాయ శాఖ ఇన్చార్జ్ జేడీఏ జయచంద్ర పేర్కొన్నారు. మండల పరిధిలోని గందోడివారిపల్లిలో ఉన్న మన విత్తన కేంద్రాన్ని పలువురు అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 3.50 లక్షల క్వింటాళ్ల పంపిణీకీ అనుమతులు వచ్చాయన్నారు. ఏపీ సీడ్స్‌కు 34 మండలాలు, ఆయిల్‌ఫెడ్‌కు 15 మండలాలు, మార్క్‌ఫెడ్‌కు 13 మండలాలు, వాసన్ ఎన్జీఓకు తనకల్లు మండలం విత్తన సేకరణ బాధ్యతల్ని అప్పగించామన్నారు.
త్వరలోనే జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో విత్తన పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తనకల్లు మండలంలో ఇప్పటి వరకు ఎంత విత్తన వేరుశనగ సేకరించారని ఏఓ రాంసురేష్‌బాబును అడిగి తెలుసుకున్నారు. 6500 క్వింటాళ్లుకు గానూ ఇంతవరకు 2,880 క్వింటాళ్లు సేకరించామని ఏఓ సమాధానమిచ్చారు. మిగిలిన వాటిని 15వ తేది లోపల పూర్తీ చేస్తామన్నారు. ఆయన వెంట వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సంపత్‌కుమార్, ఏడీఏ పీపీ విద్యావతి, ఏఓ ప్రసాద్, ఏపీ సీడ్స్ డీఎం రెడ్డెప్పరెడ్డి, ఆయిల్ ఫెడ్ పరుశురామయ్య, ఏఈఓ వెంకటేష్, జేజే సిబ్బంది ఉన్నారు.