officers fail
-
యూ..‘డై’స్ !
- విద్యార్థి గణనపై అధికారుల మొద్దునిద్ర - ఆరు మండలాల్లో ‘0’ సంఖ్య నమోదు - ఆగస్టు 5తో ముగియనున్న గడువు జిల్లాలో విద్యార్థుల గణనపై అధికారులు మొద్దనిద్ర వీడలేదు. ఆరు మండలాల్లో సర్వే ఊసే లేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్చు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టం (యూడైస్) జాబితాలో లేని విద్యార్థులను గుర్తించేందుకు చేపట్టిన ‘విద్యార్థి గణన’... విద్యాశాఖ నిర్లక్ష్యంతో నీరుగారిపోతోంది. అనంతపురం ఎడ్యుకేషన్: విద్యారంగంలో పాలనాపరమైన పారదర్శకత కోసం యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టం (యూడైస్)ను ప్రభుత్వం తీసుకువచ్చింది. 2012-13 విద్యాసంవత్సరంలో విద్యార్థుల గణనను పూర్రి చేశారు. అయితే ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ప్రజాసాధికార సర్వే ఆధారంగా బడి ఈడు పిల్లల సంఖ్యకు యూడైస్‌లో నమోదైన పిల్లల సంఖ్యకు గణనీయమైన తేడాలు వచ్చాయి. ప్రజాసాధికారిక సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలో 6 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలు 6.61 లక్షల మంది తేలారు. యూడైస్ సర్వే ప్రకారం వీరిలో బడిలో చదువుతున్న పిల్లలు 5.73 లక్షల మంది మాత్రమే ఉన్నారు. తక్కిన 88 వేలమంది విద్యార్థుల వివరాలు ఏమయ్యాయో అర్థం కావడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ‘విద్యార్థి గణన’కు మరోసారి శ్రీకారం చుట్టింది. అంతులేని నిర్లక్ష్యం ప్రజాసాధికారిక సర్వే ప్రకారం జిల్లాలో మొత్తం 6.61 లక్షల మంది 6 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలున్నారు. వీరిలో యూడైస్ లెక్కల్లో 5.73 లక్షల మంది ఉన్నారు. తక్కిన 88,134 మంది పిల్లల లెక్కలు తేల్చాల్సి ఉంది. ఇందుకోసం ఎన్యూమరేటర్ల (సీఆర్పీ, డీఎల్ఎంటీలు) ద్వారా సర్వే చేయిస్తున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేయించాల్సిన బాధ్యత మండల విద్యాశాఖ అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలపై ఉంది. ఆగస్టు 5తో గడువు ముగుస్తున్నా.. నేటికీ 13,673 మంది పిల్లల వివరాలు మాత్రమే ఆన్లైన్లో నమోదు చేశారు. అమడగూరు, బ్రహ్మసముద్రం, గోరంట్ల, గుంతకల్లు, కొత్తచెరువు, ఓడీ చెరువు మండలాల్లో ఇప్పటిదాకా ఒక్క పిల్లాడి వివరాలు కూడా నమోదు కాలేదు. అలాగే మరో 19 మండలాల్లో కేవలం రోజూ 10 మందిలోపు పిల్లల వివరాలను నమోదు చేస్తున్నారు. గడువులోగా పూర్తి చేయకపోతే చర్యలు విద్యార్థి గణన సర్వే ఆగస్టు 5లోపు పూర్తి చేయాలి. సర్వే పూర్తి చేయించాల్సిన బాధ్యత ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలదే. కార్యక్రమం పర్యవేక్షణకు సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ ఆఫీసర్లతో ప్రత్యేక బృందాలను నియమించాం. గడువులోగా సర్వే పూర్తి చేయని మండలాల అధికారులపై చర్యలుంటాయి. – సుబ్రహ్మణ్యం, ఎస్ఎస్ఏ పీఓ -
ముమ్మాటికీ నిర్లక్ష్యమే!
- టెన్త్ పరీక్షల నిర్వహణలో కొట్టుచ్చినట్లు కన్పిస్తోన్న అధికారుల వైఫల్యం - మడకశిరలో తెలుగు పేపర్-1 ప్రశ్నపత్రం లీక్ - నిర్వహణ లోపాలను తేటతెల్లం చేస్తున్న ఘటన - యాక్ట్-25 అమలులో ఉన్నా పలుచోట్ల యథేచ్ఛగా మాస్‌కాపీయింగ్ అనంతపురం ఎడ్యుకేషన్ : మడకశిర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ‘బీ’ సెంటర్లో పదోతరగతి పరీక్షల ప్రారంభం రోజే ప్రశ్నపత్రం లీకైంది. శుక్రవారం జరిగిన తెలుగు పేపర్–1 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం అరగంటలోనే బయటకు రావడమే కాకుండా వాట్సాప్‌లో హల్చల్ చేయడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి మడకశిర నియోజకవర్గ పర్యటనకు వచ్చిన రోజే ఈ ఘటన జరగడం యాదృచ్ఛికమే అయినా.. టెన్త్ పరీక్షల నిర్వహణలో అధికారుల వైఫల్యాలను మాత్రం తేటతెల్లం చేస్తోంది. పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తామని గత కొద్దిరోజులుగా అధికారులు మీడియా సాక్షిగా ప్రకటిస్తూ వచ్చారు. అయితే.. ఆచరణలో మాత్రం అంత ఘనమైన ఏర్పాట్లేమీ కన్పించడం లేదు. మడకశిరలో పరీక్షా కేంద్రం చుట్టూ ప్రహరీ ఉంది. నిబంధనల ప్రకారం హాల్‌టికెట్లు ఉన్నవారిని మాత్రమే కేంద్రంలోకి అనుమతించాలి. అలాంటప్పుడు పరీక్షా కేంద్రంలోకి కొత్త వ్యక్తులు ఎలా వచ్చారు? పాఠశాల సిబ్బంది తనిఖీ చేయలేదా? పోలీసులు కూడా పట్టించుకోలేదా?..ఈ ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. గదిలో విద్యార్థులకు ప్రశ్నపత్రం ఇచ్చినప్పటి నుంచి ఇన్విజిలేటర్ డేగకన్ను వేసి పరిశీలించాల్సి ఉంటుంది. మరి కిటికీలో నుంచి ప్రశ్నపత్రం తీసుకుని ఫొటోలు తీసుకుంటుంటే ఇన్విజిలేటర్ గమనించలేకపోయారా?.. ఈ ప్రశ్నలన్నింటికీ అధికారులే సమాధానం చెప్పాలి. ఈ ఘటనతో విద్యాశాఖ అధికారుల అలసత్వం మరోసారి స్పష్టంగా బయటపడింది. గతంలో జరిగిన సమ్మేటివ్–1, సమ్మేటివ్–2 పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా జిరాక్స్ కేంద్రాల్లో దర్శనమిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కామన్ ప్రశ్నపత్రాలు అయినా రెండు రోజుల ముందే విద్యార్థుల చేతుల్లో కనిపించాయి. వీటిపై ‘సాక్షి’లో ఆధారాలతో సహా కథనాలు వెలువడ్డాయి. చివరకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పదో తరగతి పరీక్షల నిర్వహణలోనూ అక్రమాలు చోటు చేసుకుంటుండడం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కలవర పెడుతోంది. యాక్ట్ -25 అమలులో ఉన్నా బరితెగింపు యాక్ట్- 25 గురించి తెలిసిన ఎవరూ ఏ చిన్న పొరబాటుకు తావ్వివరు. ఒళ్లంతా కళ్లు పెట్టుకుని విధులు నిర్వర్తిస్తారు. 1997 నాటి యాక్ట్ -25 సెక్షన్ 10లోని నిబంధనలను పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా బాధ్యులపై క్రిమినల్ కేసుల నమోదుతో పాటు జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. ఆర్నెల్ల నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ. 5 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా ఉంటుంది. విధుల్లో ఉన్నవారే కాదు ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారు, ప్రోత్సహించిన అందరికీ శిక్ష ఉంటుంది. మరి ఇంతటి కఠినమైన చట్టం అమలులో ఉన్నా బరి తెగిస్తున్నారంటే ఏమనుకోవాలి?! డిన్నర్లకు కక్కుర్తి! పరీక్షల నిర్వహణలో కొందరు టీచర్లు డిన్నర్లకు కక్కుర్తి పడుతున్నారు. కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మొదలుకుని ఇన్విజిలేటర్లను కొన్ని పాఠశాలల యాజమాన్యాలు విందుతో బుట్టలోకేసుకుంటున్నాయి. రాత్రి డిన్నర్లు ఇచ్చి ఉదయం పరీక్షలో తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటున్నాయి. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాల్సిన సిబ్బందే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడం కూడా బరితెగింపునకు ఊతమిస్తోంది.