కార్యాలయాలన్నీ 1/2
హైదరాబాద్: హైదరాబాద్‌లోని సచివాలయంతోపాటు అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఒన్ బై టు కాబోతున్నాయి. రాష్ట్ర విభజన నేపధ్యంలో హైదరాబాద్ నగరం గరిష్టంగా పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్న విషయం తెలిసిందే. దాంతో దాదాపు అన్ని కార్యాలయాలను సగం సగంగా విభజించి రెండు రాష్ట్రాలకు కేటాయించే పనులు చెకచెకా జరుగుతున్నాయి.
సచివాలయంలోని బ్లాక్‌లను కూడా అదేవిధంగా విడగొడుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కార్యాలయం తెలంగాణ సిఎంకు, హెచ్ బ్లాక్‌ను సీమాంధ్ర సీఎంకు కేటాయిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా పోలీసు శాఖకు చెందిన కీలక కార్యాలయాలన్నీ వన్ బై టూగా పంచుకోవాలని నిర్ణయించారు. ఉన్నతస్థాయి కమిటీ కూడా దీనికి ఆమోదముద్ర వేసింది. తక్షణం ఆయా కార్యాలయాలకు డెరైక్టరీలు రూపొందించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి మూడు రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. దీంతో పోలీసులకు కొత్త తలనొప్పి మొదలైంది. కొత్త కార్యాలయాలకు డోర్ నెంబర్లు, ఫోన్ నెంబర్ల కోసం వారు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదంతా మూడు రోజులలో అయ్యే పనేనా? పోలీసు విభాగం ఇరు రాష్ట్రాల డీజీపీ కార్యాలయాలతో పాటు సీఐడీ, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ, సీఐ సెల్ వంటివి ఒకే ప్రాంగణంలో ఉంచాలని నిర్ణయించారు. ‘విడిపోయీ కలిసుందాం’ అనే నినాదంతో వారు ముందుకు వెళ్తున్నారు.