officials ignored
-
మూగబోయిన ‘మీనా ప్రపంచం’
- పాఠశాలల్లో మూలనపడ్డ రేడియోలు - పట్టించుకోని అధికారులు నేరడిగొండ : విందాం.. తెలుసుకుందాం అంటూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన మీనా ప్రపంచం రేడియో కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో మూగబోయింది. విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించేందుకు పాఠశాలలకు పంపిణీ చేసినా రేడియోలు అటకెక్కాయి. 2012 సెప్టెంబర్ 5న ప్రభుత్వం మీనా ప్రపంచం కార్యక్రమాన్ని ప్రారంభించగా అధికారుల నిర్లక్ష్యంతో ప్రారంభించిన నెలకు రేడియోలు మూలనపడ్డాయి.మండలంలో మొత్తం 74 పాఠశాలలు ఉన్నాయి. అందులో ప్రాథమిక పాఠశాలలు 59, ప్రాథమికోన్నత 5, ఉన్నత 5, ఆశ్రమ పాఠశాలలు 3,కస్తుర్బా 1,మినీ గురుకులం 1 ఉన్నాయి. మండలంలో ఒకటి రెండు పాఠశాలల్లో మినహా మీనా ప్రపంచం రేడియో కార్యక్రమం ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. ప్రాథమిక పాఠశాలల్లోని ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల కోసం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 11 నుంచి 11:30 వరకు విందాం తెలుసుకుందాం కార్యక్రమం ప్రసారమవుతోంది. కానీ రేడియోలు వినియోగంలో లేక అసలు మీనా ప్రపంచం గురించే తెలియదని విద్యార్థులు పేర్కొనడం గమనార్హం. మరికొన్నింటిలో ఆకాశవాణి సిగ్నల్ అందక పోవడంతో కార్యక్రమం ప్రసారం కావడంలేదు. దీంతో రేడియోలు బీరువాలకే పరిమితమయ్యాయి. కొన్ని పాఠశాలల్లో అసలు రేడియోలే కనిపించకుండా పోయాయని ఆరోపణలు వస్తున్నాయి. దీనిని పర్యవేక్షణ చేసే అధికారులు లేక ఆర్వీఎం, యునిసెఫ్ సంయుక్తంగా అమలు చేసిన మీనా ప్రపంచం కనుమరుగవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల విద్యార్థులకు బాలల హక్కులు లింగ వివక్ష స్నేహ పూర్తి పాఠశాలలు అనే మూడు అంశాలపై మీనా ప్రపంచం ఉంటుంది. వీరికి సోమవారం నుంచి బుధవారం వరకు ఆకాశవాణి ద్వారా ఉదయం 11:45 నుండి 12:00 వరకు ఈ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మొదట మీనా కథ, రెండో భాగం అందరు పాడగలిగే పాట, మూడో భాగంగా విద్యార్థులతో ఆట, ఫజిల్, క్విజ్‌ను విద్యార్థులకు వినిపించాలి. అందుకు గానూ పాఠశాలల్లో విద్యార్థుల నిధులతో రేడియోలు సమకూర్చుకోవాలి. మధ్యలో అంతరాయం కలగకుండా బ్యాటరీలు ఏర్పాటుచేసుకోవాలి. ఈ కార్యక్రమ అమలు గతంలో కొనుగోలు చేసిన రేడియోలు కొన్ని పాఠశాలల్లో ఉండగా మరికొంత మంది నిధులు వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమం అమలుకు పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. కానీ చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే మీనా ప్రపంచం మూగబోతోందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
ఆదేశాల అమలుకు ఐదేళ్లా?
పోలీసు పదోన్నతుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులను నిలదీసిన అత్యున్నత న్యాయస్థానం జాప్యానికి ఎనిమిది వారాల్లోగా కారణాలు చెప్పాలని ఆదేశం న్యూఢిల్లీ: పోలీసు అధికారుల పదోన్నతుల అమలు విషయంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ మండిపడింది. తాము గతంలో ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదో వివరించాలని నిలదీసింది. కేసు పూర్వాపరాలు ఇవీ.. స్వతంత్ర జోన్ అయిన హైదరాబాద్‌లో పనిచేస్తున్న తమను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ కొందరు ఇన్స్పెక్టర్లు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (ఏపీఏటీ)ని ఆశ్రయించారు. అయితే హైదరాబాద్ ఆరో జోన్ పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ ట్రిబ్యునల్ వారి వాదనలను తోసిపుచ్చింది. హైకోర్టు ఫుల్ బెంచి కూడా హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2009 అక్టోబర్ 9న జస్టిస్ బి.ఎన్.అగర్వాల్, జస్టిస్ సింఘ్వీలతో కూడిన ధర్మాసనం హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా పేర్కొంటూ తీర్పు ఇచ్చింది. ఇదే సమయంలో ఇన్స్పెక్టర్లు, డీఎస్పీలు, ఏఎస్పీలు, ఎస్పీలకు పదోన్నతులు ఇవ్వాలని స్పష్టంచేసింది. అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు దీన్ని అమలుచేయలేదు. దీంతో పిటిషనర్ 2013లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. 2014 జనవరిలో ఇది విచారణకు రాగా అవిభాజ్య రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ.. కోర్టు ఆదేశాలను మార్చి 31లోగా అమలుచేస్తామని పేర్కొన్నారు. కానీ, అమలు చేయలేదు. న్యాయస్థానం తీర్పును అమలుచేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పిటిషనర్ జి.అనంతరెడ్డి మరోసారి పిటిషన్ వేశారు. దీన్ని జూలై 7న జస్టిస్ జగదీశ్‌సింగ్ కెహర్, జస్టిస్ ఆర్.కె.అగర్వాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఆ విచారణ సందర్భంగా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. జనవరి నుంచి జూన్ వరకు ఈ ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహించిన వారి పేర్ల జాబితాను ఇవ్వాలని, ఉన్నతాధికారులంతా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే రెండు వారాల్లో పదోన్నతులను అమలుచేస్తామని, అందుకు అవకాశమివ్వాలని అధికారులు కోరగా అనుమతి ఇచ్చింది. ఈ జాప్యానికి కారణాలేమిటో చెప్పండి... ఈ నేపథ్యంలో సోమవారం ఈ కేసు తిరిగి విచారణకు వచ్చింది. ఈ విచారణకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడు, తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ, రెండు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పదోన్నతులకు సంబంధించి మెరిట్ జాబితా రూపొందించి కోర్టు ఆదేశాలను అమలుచేశామని రెండు రాష్ట్ర ప్రభుత్వాల తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి విన్నవించారు. ఈ సందర్భంగా జస్టిస్ జగదీశ్‌సింగ్ కెహర్.. ఈ ఆదేశాల అమలులో జాప్యానికి కారణాలేమిటో చెప్పాలని నిలదీశారు. ‘మీకు ఇది మామూలైపోయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రతి ఆదేశం చెత్తబుట్టలోకి పోతోంది. ఒక కేసు తరువాత ఇంకొక కేసు.. అన్నీ ఇలాగే అవుతున్నాయి. మీరు ఏ కారణాలు చెప్పాలనుకుంటున్నారో ఫైల్ చేయండి. మేం పరిశీలిస్తాం. కానీ ఎందుకు అమలుచేయలేదో చెప్పాలి. ఏసీ గదుల్లో కూర్చునే మీకు బాధితుల కష్టాలు ఎలా తెలుస్తాయి? 2009 నుంచి అమలు చే యలేనంత నిర్లక్ష్యమా? సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు ఐదేళ్లు పడుతుందా? ఇదేనా మీరు ప్రజలకు అందించే సేవ? ’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ సందర్భంలో న్యాయవాది ‘కోర్టు ఆదేశాలను ఆలస్యంగానైనా అమలు చేశాం...’ అని మరోసారి చెప్పబోతుండగా.. ‘ఇది ఆలస్యంగా అమలుచేయడం కాదు.. నిర్బంధంగా అమలుచేయడం...’ అని న్యాయమూర్తి అభివర్ణించారు. ‘ఎందుకు ఆలస్యమైందో.. ఎందుకు ఇప్పటివరకు అమలుచేయలేదో కారణాలను 8 వారాల్లో మా ముందుంచండి.. అప్పుడు తుది విచారణ చేపడతాం...’ అని స్పష్టం చేశారు. -
ఆదాయానికి ‘నీళ్లొ’దిలారు...
విజయనగరం మున్సిపాలిటీ: మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అధికారుల నిర్లక్ష్యంతో ఆ శాఖకు పెద్ద మొత్తంలో ఆదాయానికి గండిపడింది. మూడేళ్ల నుంచి నీటి పన్ను వసూలు కాకపోవడంతో రూ.అర కోటికి పైగా ఆదాయం నిలిచిపోయింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 2000 కుళాయి కనెక్షన్లకు మూడేళ్లుగా డిమాండ్ నోటీసులు జారీ చేయకపోగా... అనధికారికంగా పుట్టుకొచ్చిన మరో 500 వర కూ కుళాయి కనెక్షన్లు ఉన్నట్టు తెలిసినా వాటిపై చర్యలు తీసుకోలేదు. విజయనగరం మున్సిపాలిటీలో 19 వేల వరకు కుళాయి కనెక్షన్లుండగా, వాటి ద్వారా ఏడాదికి రూ.60 నుంచి రూ.70 లక్షల వరకు పన్ను రూపంలో ఆదాయం వస్తుంది. అయితే 2010-11 సంవత్సరంలో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు అదనంగా 2000 కుళాయి కనెక్షన్లు మంజూరు చేశారు. వీటికి సంబంధించిన వివరాలను రికార్డుల్లో చూపిస్తున్నప్పటికీ డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు వీలుగా వాటిని ఆన్లైన్ చేయలేదు. దీంతో పన్ను వసూలు చేసేందుకు రెవెన్యూ విభాగం అధికారులకు అవకాశంలేకుండా పోయింది. 2000 కనెక్షన్లకు గత మూడేళ్లుగా ఒక్క నోటీసూ జారీకాలేదు. ఏడాదికి రూ. 14.40 లక్షల చొప్పున ఈ మూడేళ్లలో రూ.43 లక్షల 20వేల వరకు ఆదాయానికి గండిపడింది. అంతేకాకుండా ఇంజినీరింగ్ విభాగం అనుమతులు లేకుండా మరో 500 కనెక్షన్లు అనధికారికంగా ఉన్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఇవి కూడా మూడేళ్ల క్రితం నుంచి ఉన్నప్పటికీ వాటిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో వీటి ద్వారా ఈ మూడేళ్లలో మరో రూ.10.80 లక్షల వరకూ రావలసిన ఆదాయానికి గండిపడినట్లు తెలుస్తోంది. అనధికారిక కుళాయి కనెక్షన్లు కంటోన్మెంట్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లో మరేతర కార ణాలతోనో వాటిపై చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఈ మూడేళ్లలో అటు అధికారిక, ఇటు అనధికారిక కుళాయి కనెక్షన్ల నుంచి రావాల్సిన రూ 54 లక్షల ఆదాయానికి బ్రేక్ పడింది. వార్డు పర్యటనల్లో గమనించిన మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ ఆరా తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ ఇంజినీర్‌కు నోటీసులు ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణను వివరణ కోరగా.. పట్టణంలో అధికారికంగా మంజూరు చేసిన 2000 కుళాయి కనెక్షన్లకు మూడేళ్లుగా డిమాండ్‌నోటీసులు జారీ చేయకపోవడం వాస్తవమేనన్నారు. దీనిపై మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారి బాబుకు నోటీసుతో పాటు మెమో జారీ చేసినట్టు తెలిపారు. విచారణ చేసేందుకు డీఈతో కమిటీ వేశామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనధికారికంగా 500 వరకు కుళాయి కనెక్షన్లు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని వాటిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.