అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి
- కలెక్టర్ వాకాటి కరుణ
- మానుకోట గ్రీవెన్స్‌సెల్‌కు హాజరు
- బంధం చెరువు పనుల పరిశీలన
- నత్తనడకన పనులపై ఆగ్రహం
మహబూబాబాద్ : అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రతి దరఖాస్తును పరిశీలించి... సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ వాకాటి కరుణ సూచిం చారు. మానుకోట ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమం, ఆ తర్వాత పట్టణ శివారులోని బంధం చెరువును పరిశీలించిన క్రమంలో ఆమె మాట్లాడారు. మిషన్ కాకతీయ కార్యక్రమంలో అధికారుల పర్యవేక్షణ ఉంటేనే పనుల్లో నాణ్యత ఉంటుందన్నారు. చెరువు మట్టిని రైతులు ఉపయోగించుకునేలా అధికారులు వారికి అవగాహన కల్పించాలన్నారు. నిర్ణీత గడువులోపు చెరువు పనులను పూర్తి చేయించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. మూడు రోజులకు ఒకసారి చెరువులపై సమీక్ష జరుగుతుందని, సమగ్ర సమాచారంతో అధికారులు సపిద్ధంగా ఉండాలన్నారు.
పింఛన్ల విషయంలో పూర్తి బాధ్యత అధికారులపై ఉందని, ఇకపై సామాజిక తనిఖీ నిర్వహిస్తామన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. చెరువులను పర్యవేక్షించడం లేదని గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదులు రావడంతో ఎంపీడీఓలు, తహసీల్దార్లపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఓ భాస్కర్‌రావు, డ్వామా పీడీ వెంకటేశ్వరరావు, డీటీడబ్ల్యూ రాంమూర్తి, సీడీపీఓ నిర్మల, ఎంపీడీఓ రవీందర్, తహసీల్దార్ శ్రీరాం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
బంధం చెరువు పనులపై ఆగ్రహం
బంధం చెరువు పనులు వేగవంతం కాకపోవడంతో ఇరిగేషన్ ఈఈ రత్నం మండిపడ్డారు. అసంపూర్తి పనులను చూసి అసహనాన్ని వ్యక్తం చేశారు. చెరువు చుట్టూ అక్రమంగా వెలిసిన ఇళ్లను కూల్చివేసి చెరువును అభివృద్ధి చేయూలని, చెరువు చుట్టూ ఉన్న గుమ్చీలను తొలగించాలన్నారు. నిర్ణీత సమయంలో పూర్తి చేయకుంటే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆమె వెంట ఎంపీ అజ్మీర సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, తహసీల్దార్ శ్రీరాం మల్లయ్య, నాయకులు మార్నేని వెంకన్న, డోలి లింగుబాబు, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, పొనుగోటి రామకృష్ణారావు, యాకుబ్ రెడ్డి, నీలేష్రాయి, భాస్కర్ ఉన్నారు.
కాగా, స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు రుణాలందించాలని, రైతులకు రుణాలిచ్చే విషయంలో అధికారులు, బ్యాంకర్లు ఇబ్బందులు పెట్టొద్దని, పనుల కోసం వచ్చిన రైతులను కార్యాలయం చుట్టూ తిప్పుకోవద్దని ఆమె సూచించారు. ఇదిలా ఉండగా, పట్టణంలోని ఏరియా ఆస్పత్రి సమీపంలోని ఆర్యూబీని కలెక్టర్ పరిశీలించారు. ఎత్తు తక్కువగా ఉండటం, ఆ నిర్మాణం సక్రమంగా లేదని పలువురు నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.